
- 4 పైలెట్ మండలాల్లో 12 వేలకు పైగా అప్లికేషన్లు
- పట్టాదారు పాసుపుస్తకాల్లో కరెక్షన్స్కోసమే అత్యధికం
- జూన్ 2 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
- లక్షల్లో దరఖాస్తులు వస్తాయనే అంచనాలు
- వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే
హైదరాబాద్, వెలుగు: భూభారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూసదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలు ఏడాదిన్నర కాలంలోనూ పరిష్కారం కాకపోవడంతో.. కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. గత నెల 4 పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, ఏకంగా 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికం ధరణి పోర్టల్‌లో నమోదైన తప్పులేనని తేలింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. అందువల్లే రెవెన్యూ సదస్సుల్లో వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నట్లు తెలుస్తున్నది.
60 శాతం పాస్‌బుక్ కరెక్షన్సే
గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు భూ సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశాయి. 72 రెవెన్యూ గ్రామాల్లో జరిగిన ఈ సదస్సుల్లో రైతుల నుంచి ఏకంగా 12,347 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 60 శాతం పట్టాదారు పాసుబుక్‌ల కరెక్షన్‌కు సంబంధించినవే ఉన్నాయి. సర్వే నెంబర్ల తప్పిదాలు 32%, భూ విస్తీర్ణం తక్కువగా నమోదైనవి 25%, మిస్సింగ్ ఎక్స్‌టెంట్ 20% ఉండడం గమనార్హం. కొందరు రైతులకు చెందిన భూముల వివరాలు పూర్తిగా మాయమయ్యాయి. ఒక్కో మండలంలో సగటున 3 వేల దరఖాస్తులు రావడంతో.. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ పెద్దలు సైతం పరేషాన్లో పడిపోయారు. మరోవైపు ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా మండలాలు, 12 వేలకు పైగా గ్రామాలు ఉండడంతో లక్షల్లో అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తహసీల్దార్లపైనే సమస్యల పరిష్కార భారం..
ప్రస్తుతం వస్తున్న అప్లికేషన్లను బట్టి క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా కనిపిస్తున్నది. ధరణి వచ్చిన తర్వాత భూముల వివరాల్లో తప్పులు దొర్లడం, పట్టాదారు పాసుబుక్‌లు రాకపోవడం, ఉన్న భూమి తక్కువగా నమోదు కావడంలాంటి సమస్యలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చి.. తప్పొప్పుల సవరణకు అప్లికేషన్లు తీసుకుంటున్నది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయనుకుంటే, లక్షల్లో వస్తుండడంతో వాటిని వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. ప్రధానంగా తహసీల్దార్లపైనే అధిక భారం పడనుంది. ప్రస్తుతం భూ భారతి పోర్టల్ అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించారు. దీని ప్రకారం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి తహసీల్దార్లు ఇచ్చే రిపోర్టులే కీలకం కానున్నాయి. కానీ కొందరు తహసీల్దార్లు ఫీల్డ్రిపోర్టుల కోసం రైతుల నుంచి డబ్బులు డిమాండ్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే నెగెటివ్ రిపోర్ట్ రాసి ఇబ్బంది పెడ్తారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నందున నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా తహసీల్దార్లపై సర్కారు ఒత్తిడి తేవాలని, లేదంటే భూ సమస్యలను ఇలాగే కంటిన్యూ చేసి గతంలోలాగే అవినీతి కొనసాగిస్తారని రైతులు అంటున్నారు.