255 చెట్లకు ప్రాణప్రతిష్ట

255 చెట్లకు ప్రాణప్రతిష్ట
  • ట్రాన్స్​ లొకేషన్​ పద్ధతిలో నాటనున్న ‘నేషనల్​ హైవేస్’​
  • జాతీయ రహదారి 61 పై 2,545 చెట్ల తొలగింపు  
  • ఒక చెట్టుకు పది చెట్లు నాటుతామన్న ఆఫీసర్లు 

    నిర్మల్, వెలుగు : నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా జగిత్యాల జిల్లా రాయికల్ వరకు నిర్మించతలపెట్టిన నేషనల్ హైవే 61కి  రెండువైపులా ఉన్న చెట్లను ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో వేరే చోట నాటనున్నారు. వీటికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. కవ్వాల్ అభయారణ్య పరిధిలో ఈ  ప్రాంతం ఉన్న కారణంగా హైవే నిర్మాణ కోసం మట్టి తవ్వకం, చెట్ల తొలగింపుపై అటవీశాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయి. దీని కారణంగా రోడ్డు పనులు దాదాపు నాలుగేండ్ల పాటు నిలిచిపోయాయి. అయితే తొలగించే ఒక చెట్టుకు బదులు పది చెట్లను నాటాలని, ఈ రోడ్డుపై ఏడు చోట్ల వన్యప్రాణులు దాటేందుకు వీలుగా అండర్ పాస్​లను నిర్మించాలని  కేంద్ర అటవీశాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షరతు పెట్టడంతో నేషనల్ హైవేస్​అంగీకరించింది. 
    తొలగించాల్సిన చెట్లు 5,245  
    రోడ్డుకు రెండు వైపులా 5245  చెట్లను తొలంగించాల్సి ఉండగా ఇప్పటికే  1500 చెట్లను తొలగించారు. ఇందులో అటవీ శాఖకు సంబంధించినవి 2875, రెవెన్యూ శాఖ పరిధిలో  2366 చెట్లున్నాయి. కాగా, ఫారెస్ట్​పరిధిలో 130, నాన్ ఫారెస్ట్ పరిధిలో 125 టేకు చెట్లను ట్రాన్స్​లొకేట్ ​చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్ కు చెందిన  గ్రీన్ మార్నింగ్ వైట్ రిబ్బన్స్  ఏజెన్సీ చేస్తోంది. మొత్తం రూ.50 లక్షల అంచనా వ్యయంతో  ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు నెలల కింద పనులు మొదలుపెట్టారు.   
    చెట్లను బతికించుకునేందుకే ...
    చెట్ల తొలగింపుకు అన్ని అనుమతులు తీసుకున్నాం. అయితే సుమారు 250 చెట్లను ట్రాన్స్ లొకేషన్  పద్ధతిలో  వేరే చోట నాటనున్నాం. అభివృద్ధిలో భాగంగా కొన్నిసార్లు మనకు నీడను, గాలిని ఇచ్చే చెట్లను కొట్టేయాల్సి వస్తుంది. కానీ, కొన్నింటినైనా తిరిగి బతికించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  - సుభాష్, డీఈ, నేషనల్ హైవే డిపార్ట్​మెంట్, నిర్మల్.