
- నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్
- రూ.64 లక్షల విలువైన సరుకు స్వాధీనం
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ -భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటి ఎక్స్ రోడ్ వద్ద టీఎస్ -న్యాబ్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.64 లక్షల విలువ చేసే 128 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంగారెడ్డి టీఎస్ -న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముత్తంగి వద్ద ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు, బొలెరో వెహికల్స్ను పరిశీలించగా, 55 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు.
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ వద్ద గంజాయి తెచ్చి మహారాష్ట్రలో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహారాష్ట్రకు చెందిన ఫిరోజ్ అహ్మద్, ఒడిశా గజపతి జిల్లాకు చెందిన సగర్ నాయక్ అలియాస్ సగర్, మలేగావ్ మహారాష్ట్రకు చకెందిన మెహబూబ్ అబ్దుల్ అహ్మద్ అలియాస్ అంసారీ, మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.