13 ఎకరాల లుంబినీ పార్క్​ను 5 ఎకరాలకు కుదించిన్రు: కోదండరెడ్డి

13 ఎకరాల లుంబినీ పార్క్​ను 5 ఎకరాలకు కుదించిన్రు: కోదండరెడ్డి
  • అంజయ్య విగ్రహం ముందున్న స్థలాన్ని యథావిధిగా ఉంచాలె : కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: లుంబినీ పార్క్​ను 13 ఎకరాల నుంచి 5 ఎకరాలకు కుదించారని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్క్​లోని అంజయ్య విగ్రహం ముందు ఉన్న స్థలాన్ని సెల్ఫీ పార్క్​, పార్కింగ్​ ప్రదేశాలుగా మార్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పేరు రావాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ పాత సెక్రటేరియెట్​ను కూల్చి.. కొత్తది కట్టారని, ఇప్పుడు అదే రీతిలో లుంబినీ పార్క్​ దగ్గర మార్పులు చేశారని ఆరోపించారు. 
మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. అంజయ్య విగ్రహం ముందున్న స్థలాన్ని యథావిధిగా ఉంచాలని, వారం రోజులు టైం ఇస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సెక్రటేరియెట్​ పరిసరాల్లో కోట్లు ఖర్చు పెట్టి కార్ల రేసింగ్​ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. కోతుల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కమర్షియల్​గా ఆలోచించడం మానుకోవాలని కోదండ రెడ్డి హితవు పలికారు.