టెంపోపై ట్రక్కు పడి 13 మంది మృతి

టెంపోపై ట్రక్కు పడి 13 మంది మృతి

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో పైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మల్కాపూర్‌‌ దగ్గర ముంబై–నాగ్‌‌పూర్‌‌ హైవేపై సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ యాక్సిడెంట్‌‌ జరిగింది. ఇటుకబట్టీలో పని చేసే కూలీలు మల్కాపూర్‌‌ నుంచి అనురాబాద్‌‌కు ఓ టెంపోలో వెళ్తున్నారు. అదే సమయంలో గుజరాత్‌‌లోని కచ్‌‌ నుంచి నాగ్‌‌పూర్‌‌కు ఉప్పు లోడుతో వెళ్తున్న ట్రక్కు టైరు పేలిపోయింది. వేగం ఎక్కువుండటంతో ట్రక్కుపై డ్రైవర్‌‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న టెంపోపై పడింది. ఆ దెబ్బకు టెంపో నుజ్జునుజ్జయింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. ప్రమాదం తీవ్రతకు పలు మృతదేహాలు నుజ్జయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్స్‌‌కు ఫోన్‌‌ చేశారు. టెంపోలో ఇరుక్కున్న వారిని తీయడానికి ప్రయత్నించినా కుదరలేదు. జేసీబీ సాయంతో ట్రక్కు, టెంపో వాహనాలను వేరు చేసి మృతదేహాలను పోలీసులు బయటకుతీశారు. చనిపోయిన వారిలో అనురాబాద్‌‌కు చెందిన వారు ఐదుగురు, నాగ్‌‌జరికి చెందిన ఆరుగురు, భుస్వాల్‌‌ వాసులు ఇద్దరున్నాని తెలిపారు. 400 బ్యాగుల ఉప్పు లోడుతో మే 18న గుజరాత్‌‌ నుంచి ట్రక్కు బయలుదేరిందని పోలీసులు చెప్పారు.