ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి 13 ఫ్లైట్స్ దారి మళ్లింపు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి 13 ఫ్లైట్స్ దారి మళ్లింపు

వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ 16న రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్య ఢిల్లీ విమానాశ్రయం నుంచి జైపూర్, లక్నో, అహ్మదాబాద్‌లకు మొత్తం 13 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. "ఈ మళ్లింపులు ఎక్కువగా రాత్రి 7 - 11 గంటల మధ్య జరిగాయి. విమానాలను జైపూర్, అహ్మదాబాద్, లక్నోలకు మళ్లించారు. వీటి గురించి నిర్దిష్ట వివరాలను వెంటనే నిర్ధారించలేము" అని అధికారులు తెలిపారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సోమవారం వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో వర్షంతో కూడిన గాలులు వీచాయి. నోయిడా, ఇందిరాపురం, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదైంది. "ఢిల్లీ, NCR అంతటా భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. పశ్చిమం నుంచి తూర్పు వరకు తీవ్రమైన వర్షం, వడగళ్ళ తుఫానులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి" అని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అక్టోబర్ 17న సాధారణంగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఇవి వరుసగా 31, 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.