- ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
- 15 రోజుల్లో అభ్యంతరాలు, వినతుల స్వీకరణ
- ఆ తరువాత ఫైనల్ నోటిఫికేషన్
- మునుగోడు నియోజకవర్గంలో కొత్త మండలం గట్టుప్పల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 మండలాల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్, మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్, బోదన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర కొత్త మండలాలుగా ఏర్పాటు కానున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలాలుగా మారనున్నాయి. ప్రజా అవసరాలను పరిశీలించి కొత్త మండలాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
‘గట్టుప్పల్’ బై ఎలక్షన్ కోసమేనా?
మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలున్నాయి. అదే జరిగితే.. అక్కడ ఉప ఎన్నిక వచ్చే చాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. అందుకే గతంలో హుజూరాబాద్‌పై దృష్టిపెట్టినట్లు ముందస్తుగానే సీఎం కేసీఆర్ మునుగోడుపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం మొదలైంది. రెండు రోజుల కింద ఆయన మంత్రి జగదీశ్ రెడ్డితో ఈ విషయంపై చర్చలు జరిపారు. అయితే గట్టుప్పల్ ఒక్కటే మండలంగా ఏర్పాటు చేస్తే.. ఎలక్షన్స్ కోసమే వరాలు కురిపించిన ఆరోపణలు వస్తాయని భావించినట్లు తెలుస్తోంది.
