13 ఏండ్ల బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించిండు

13 ఏండ్ల బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించిండు
  • స్టవ్ అంటుకుందని బుకాయింపు
  • 70% గాయాలతో ఆస్పత్రిలో బాధితురాలు
  • కోమాలోంచి బయటపడి తల్లిదండ్రులకుచెప్పడంతో తెలిసిన నిజం
  • పోలీసులు అదుపులో నిందితుడు
  • కఠినంగా శిక్షించాలని జనం ఆందోళన

ఖమ్మం, ఖమ్మం అర్బన్, వెలుగుఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలికపై ఇంటి ఓనర్ కొడుకు కన్నేశాడు. ఆమెను రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకుందనే కోపంతో ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన ఓనర్​ ఫ్యామిలీ.. ఇంట్లో స్టవ్ మంటలు అంటుకున్నాయని బుకాయించింది. ఖమ్మం సిటీలో పోయిన నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాధితురాలు ఇన్నాళ్లు కోమాలో ఉంది. సోమవారం ఆమె స్పృహలోకి వచ్చి, తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

రూ.10 లక్షలు ఇస్తమని బేరం

ఇన్ని రోజులు బాలిక కోమాలో ఉండడంతో అందరూ అదే నిజం అనుకున్నారు. ఆమె సోమవారం స్పృహ లోకి వచ్చి, జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు తెలియనీయవద్దని బాలిక తల్లిదండ్రులతో రూ.10 లక్షలకు ఓనర్​ సుబ్బారావు కుటుంబసభ్యులు బేరాలు ఆడారు. ఒప్పుకోవాలని బాలిక తల్లిదండ్రులపై సుబ్బారావు ఒత్తిడి తెచ్చాడు. కానీ తమకు పరిహారం వద్దని, న్యాయం కావాలని వారు సోమవారం వన్​టౌన్ పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు నిందితుడిపై ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వినలేదని పెట్రోల్ పోసి నిప్పు…

బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారు తమ కుమార్తెల్లో ఒకరిని ఖమ్మం సిటీ ముస్తఫానగర్ లోని అల్లం సుబ్బారావు ఇంట్లో పని మనిషిగా చేర్చారు. సుబ్బారావు కొడుకు మారయ్య(26) పోయిన నెల 18న తెల్లవారుజామున ఆ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో మారయ్య కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక బాలిక అరవడంతో సుబ్బారావు, ఆయన కుటుంబసభ్యులు ఆమెను సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక శరీరం 70 శాతం కాలిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన కుమారుడికి శిక్ష పడుతుందని సుబ్బారావు ఆస్పత్రి మేనేజ్ మెంట్ కు అబద్ధం చెప్పాడు. ఇంట్లో ప్రమాదవశాత్తు స్టవ్​ద్వారా మంటలు అంటుకున్నాయని డాక్టర్లను నమ్మించాడు. రెండ్రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులకు కూడా అదే విషయం చెప్పాడు.

ప్రజాసంఘాల ఆందోళన…

బాలికపై అత్యాచార యత్నం విషయం తెలియడంతో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు బాధితురాలు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రి దగ్గర ఆందోళన చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఖమ్మం సీపీ తఫ్సీర్​ఇక్బాల్ ఆస్పత్రి దగ్గరికి వచ్చి వారిని సముదాయించారు. బాధితురాలిని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. జూనియర్​ సివిల్ జడ్జి ఉషశ్రీ బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకున్నారు. బాధితురాలిని బీజేపీ రాష్ట్ర నాయకుడు సన్నే ఉదయ్ ప్రతాప్ పరామర్శించారు.

కఠినంగా శిక్షించాలి  

మా కుటుంబానికి అన్యాయం చేసిన మారయ్యను కఠినంగా శిక్షించాలి. మరో అమ్మాయికి ఇలా జరగకుండా ఇలాంటి వాళ్లను కాల్చి చంపాలి. ఇన్ని రోజులు మాకు అబద్ధం చెప్పి మోసం చేశారు.

– బాధితురాలి తల్లి