
- సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక రూల్స్ పాటించనివారిపై చలాన్ల మోత
- మొత్తం 13,869 కేసులు, రూ.1.13 కోట్ల ఫైన్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో ట్రాఫిక్ చలానాల మోత మోగుతోంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక జూన్ 27 నుంచి జూలై 17 వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 13,869 మందిపై కేసులు(చలానాలు) నమోదవ్వగా.. రూ. 1,13,43,400 ఫైన్లు విధించారు. ఈ ఉల్లంఘనల్లో సగానికిపైగా ట్రిపుల్ రైడింగ్ కేసులే ఉన్నాయి. ఆ తర్వాత సీట్ బెల్ట్ ధరించని వారిపై కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘనలు తక్కువగా నమోదయ్యాయి. ఓ వైపు చలాన్ల మోత మోగుతున్నా, తమపై సిటీ మొత్తం సీసీ కెమెరాల నిఘా ఉందని తెలిసినా కొందరు వాహనదారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ట్రిఫుల్ రైడింగ్ ఉల్లంఘనలే ఎక్కువ
కరీంనగర్ సిటీలో గత 21 రోజుల్లో జరిగిన 13,869 ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల్లో అత్యధికంగా ట్రిపుల్ రైడింగ్(63 శాతం)వే ఉన్నాయి. ట్రిపుల్ రైడింగ్ చేసిన ఘటనల్లో 8,808 కేసులు నమోదయ్యాయి. ట్రిపుల్ రైడ్చేసిన ఒక్కో టూవీలర్స్‌కు రూ.1200 చొప్పున రూ.1,05,69,600 ఫైన్లు విధించారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తూ సీసీ కెమెరాల్లో చిక్కిన 3,437 మందికి రూ.3,43,700 జరిమానా విధించారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ సీసీ కెమెరాల్లో చిక్కిన 251 మందిపై ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున రూ.2,51,000, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ సీసీ కెమెరాల్లో చిక్కిన 418 మందిపై రూ.83,600 ఫైన్ వేశారు. జూన్ 27న హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన 955 మందికి రూ. 95,500 ఫైన్ వేశారు. ప్రస్తుతానికి హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఓవర్ స్పీడ్‌పై జరిమానాలు విధించట్లేదని, ఇతర శాఖల సమన్వయంతో త్వరలో అవి కూడా అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు.
సిటీపై నిరంతర నిఘా: సీపీ గౌస్ ఆలం
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన 769 సీసీ కెమెరాలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కనెక్టయి ఉన్నాయి. అక్కడి నుంచి సిటీపై నిరంతర నిఘా పెడుతున్నట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను సైతం ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తూ చలాన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సిటీలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టినట్లు సీపీ చెప్పారు. సిటీలోని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.