కరోనా సోకిన 13 మంది ఖైదీలు పరార్

 కరోనా సోకిన 13 మంది ఖైదీలు పరార్
  • ఇనుప కడ్డీలు కట్ చేసి.. బెడ్ షీట్లను తాళ్లుగా మలచుకుని పరార్
  • హర్యానాలోని రేవారి కరోనా ప్రత్యేక జైలులో ఘటన

హర్యానాలో కరోనా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 13 మంది కరోనా ఖైదీలు తప్పించుకుని పరారయ్యారు. బ్యారెక్ లోని జైలు గది ఇనుప చువ్వలను కత్తిరించి తప్పించుకున్నారు. హర్యానాలోని రేవారిలో నిర్మాణంలో ఉన్న జైలును ప్రస్తుత కరోనా సమయంలో కరోనా సోకిన ఖైదీలకు ప్రత్యేక సదుపాయాల జైలుగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన ఖైదీలను ఈ జైలులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మానవత్వంతో జైలు సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరించడంతో వీరు అవకాశంగా చేసుకుని తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది. 

రేవారి కరోనా ఖైదీల జైలులో 493 మంది కరోనా ఖైదీలు ఉండగా.. వీరిలో 13 మంది ఖైదీలు పరారయ్యారు. శనివారం రాత్రి వీరు తమ బ్యారెక్ ఇనుప కడ్డీలు కట్ చేసి.. బెడ్ షీట్లను తాళ్లుగా చేసుకుని జైలు నుంచి పరారయ్యారు. ఆదివారం ఉదయమే వీరి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టడంతో వ్యవహారం బయటకు పొక్కింది. తప్పించుకున్న ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హర్యానా రాష్ట్ర సరిహద్దులోని పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.