తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు

హయత్ నగర్ మునగనూరులోని మెజిస్టేట్ ముందు తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురుని మేడిపల్లి పోలీసులు హాజరుపర్చగా... వారికి 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మల్లన్నతో పాటు మిగతా నలుగురిని చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. అంతకుముందు కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు విడుదల చేశారు. సాయి కరణ్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టుగా ఉన్న కంప్లైంట్ లెటర్ ను సైతం ఈ కాపీకి జత చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ లో తనను క్యూ న్యూస్ సిబ్బంది నిర్భందించి, దాడి చేశారని సాయి కరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా ఈ కాపీలో పోలీసులు వెల్లడించారు.

అదుపులోకి తీన్మార్ మల్లన్న భార్య..

తీన్మార్ మల్లన్న భార్య మమతను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మల్లన్న రిమాండ్ అనంతరం విడిచిపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీసేందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు మమత రాగా.. మల్లన్నతో మాట్లాడిస్తామని చెప్పి పోలీసులు ఆమెను అక్కడినుండి తీసుకెళ్లారు.

అసలేమైందంటే..

తీన్మార్ మల్లన్నను మార్చి 21 మంగళవారం రోజు పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో 20 మంది పోలీసులు ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ లో సోదాలు చేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితమే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి.. విధ్వంసం సృష్టించగా.. ఆయన్ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. గతంలో సైతం క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసిన వారిని ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. చాలాసార్లు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినా.. వార్తలు ఆగలేదన్నారు.