న్యూఢిల్లీ: దాదాపు నాలుగేండ్లుగా సాగుతోన్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాస్కో సమీపంలోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా పుతిన్ నివాసంపైనే ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా చేసిన ఎలిగేషన్స్ ప్రపంచదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ స్పందించారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన మోడీ.. పుతిన్ నివాసంపై దాడుల నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య మార్గాల ద్వారా శాంతిని సాధించాలని పిలుపునిచ్చారు. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారన్న నివేదికలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాను. దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేసి శాంతిని సాధించడానికి అత్యంత ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తాయి. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలి. వాటిని దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై తనకు చాలా కోపంగా ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తోన్న వేళ ఇది సరియైన పద్దతి కాదన్నారు. సోమవారం ఉదయాన్నే పుతిన్ స్వయంగా ఫోన్ చేసి తన నివాసంపై దాడి జరిగిందని చెప్పాడని ట్రంప్ తెలిపారు.
‘‘యుద్ధంలో దాడులు సహజమే కానీ ఏకంగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదు. తన నివాసంపై దాడి జరిగిందని స్వయంగా పుతినే ఫోన్ చేసి చెప్పారు. ఇది చాలా చెడ్డ విషయం. దీనిపై నాకు చాలా కోపంగా ఉంది” అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని చెప్పారు. ఇంటెలిజెన్స్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు: రష్యా
2025, డిసెంబర్ 28, 29 తేదీల్లో మాస్కోకు పశ్చిమాన నోవ్‌గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్‌లను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. రష్యన్ వైమానిక రక్షణ దళాలు ఉక్రెయిన్ దాడులను సమర్థవంతగా తిప్పికొట్టాయని చెప్పారు. ఈ దాడిలో ఎటువంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
ఈ చర్యను ఉగ్రవాదంగా అభివర్ణించిన రష్యా.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. పుతిన్ నివాసంపై దాడులకు సంబంధించి రష్యా ఎటువంటి ఆధారాలు చూపించలేదని.. ఇవి కేవలం నిరాధార ఆరోపణలు అని కీవ్ కొట్టిపారేసింది. శాంతి చర్చలను దెబ్బ తీసేందుకు రష్యా డ్రామాలు చేస్తోందని విమర్శించింది. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తోన్న వేళ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లైంది.
