రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరికొన్నేళ్లు సాగవచ్చు: డొనాల్డ్ ట్రంప్

రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరికొన్నేళ్లు సాగవచ్చు: డొనాల్డ్ ట్రంప్

పామ్ బీచ్(అమెరికా): రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతి చర్చల కోసం ఆ రెండు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వోలోదిమిర్  జెలెన్​స్కీ మరింత ముందుకు వచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జెలెన్​స్కీతో పామ్ బీచ్‎లోని తన మార్ ఎ లాగో రిసార్టులో ట్రంప్ ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) భేటీ అయ్యారు. అనంతరం జెలెన్​స్కీతో కలిసి మీడియాతో ట్రంప్  మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. 

జెలెన్ స్కీతో సంప్రదింపులు జరుగుతున్నా కూడా రష్యా, ఉక్రెయిన్  మధ్య యుద్ధం మరికొన్నేళ్ల పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘‘నాతో సమావేశం కోసం జెలెన్ స్కీ అమెరికాకు వచ్చినా ఉక్రెయిన్ పై రష్యా అదేపనిగా దాడులు చేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్  కూడా శాంతినే కోరుకుంటున్నారని నేను ఆశిస్తున్నా. రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతి చర్చల ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఉక్రెయిన్  భూభాగాలను నియంత్రించాలని రష్యా అనుకుంటున్నది. 

ఈ విషయంలో మరోసారి పుతిన్ కు ఫోన్  చేసి మాట్లాడుతాను” అని ట్రంప్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెలెన్​స్కీని వీరుడంటూ ట్రంప్  ప్రశంసించారు. కాగా.. రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతియుత వాతావరణం కోసం సహకరించాలని ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రేట్  బ్రిటన్, పోలండ్  దేశాలతో పాటు యూరోపియన్  కమిషన్  ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయెన్ ను ట్రంప్, జెలెన్​స్కీ కోరారు. శాంతియుత వాతావరణం కోసం ట్రంప్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జెలెన్​స్కీ కొనియాడారు. అందుకు ట్రంప్ కు ఆయన థ్యాంక్స్  చెప్పారు.