నువ్విచ్చే 20, 30 వేల రూపాయల జీతం ఏంటీ బాసూ.. ఉదయం, సాయంత్రం సరదాగా డెలివరీలు చేసుకున్నా.. ర్యాపిడో, ఓలా వేసుకున్నా బిందాస్ గా ఆ డబ్బులు వస్తాయి కదా.. నిన్నా మొన్నటి వరకు ఓ వర్గం యూత్ ఆలోచన ఇలా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. పెట్రోల్, గ్యాస్ రేట్లు అమాంతం పెరగటంతో.. ఆ మేరకు హోటల్ బిల్లులు పెరిగాయి. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీలు తగ్గాయి.. డెలివరీలు తగ్గటంతోపాటు ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలతో ఆదాయం ఢమాల్ అయ్యిందంట.. గతంలో వెయ్యి, 15 వందల రూపాయలు చూసినోళ్లు.. ఇప్పుడు 500 రూపాయలతోనే సరిపెట్టుకుంటున్నారంట.. పెరిగిన ధరలతో డెలివరీ బాయ్స్ కష్టాలపై కన్నీటి గాధలు ఇలా ఉన్నాయి.
ఉదయం ఆరింటికి బండి స్టార్ట్ చేస్తే.. అర్ధరాత్రి ఒంటి గంటయినా ఇంజన్ ఆగుతుందో లేదో తెలియదు. ఎండైనా, వానైనా చేతిలో స్మార్ట్‌ఫోన్.. వెనుక ఒక పెద్ద డెలివరీ బ్యాగ్‌తో రోడ్లపై దూసుకుపోయే డెలివరీ బాయ్స్ జీవితాలు ఇప్పుడు ఒక అంతుచిక్కని సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఆకలితో ఉన్నవాడికి వేడివేడి బిర్యానీని నిమిషాల్లో అందించే వీరికి.. రోజంతా కష్టపడితే కనీసం కుటుంబ పోషణకు సరిపడ్డా డబ్బులు మిగులుతున్నాయా? అంటే సమాధానం శూన్యమనే చెప్పాలి. ఒకప్పుడు లాభసాటిగా కనిపించిన ఈ ఆన్‌లైన్ డెలివరీ ఉద్యోగాలు, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ రేట్ల మధ్య నలిగిపోతున్నాయి.
ఇటీవలే బెంగళూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ.110 దాటడంతో నగరంలోని వందలాది మంది గిగ్ వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ప్రతిరోజూ 30 నుండి 35 డెలివరీలు చేసే రాజు అనే డెలివరీ ఏజెంట్ తన ఆవేదనను పంచుకున్నాడు. రోజూ 12 గంటలకు పైగా కష్టపడితే.. యాప్‌లో మాత్రం రూ.వెయ్యి నుండి రూ.15వందలు సంపాదించినట్లు చూపిస్తుంది. కానీ కంపెనీ కమీషన్లు పోగా చేతికి వచ్చేది రూ.500 మాత్రమేనని చెప్పారు. అంతకుముందు పెట్రోల్ ఖర్చు రూ.500 లోపు ఉండేదని.. కానీ ఇప్పుడు పెరుగుతున్న రేట్ల వల్ల ఆ పెట్రోల్ ఖర్చు పోను రోజు ముగిసేసరికి పట్టుమని 500 వందలు కూడా ఉండటం లేదన్నారు. 12-14 గంటలు రోజుకు పనిచేసినా ఇంత తక్కువ సంపాదనతో తమ జీవితాలు తారుమారు అయ్యాయని వాపోతున్నారు.
ఈ సమస్యలపై కంపెనీ ప్రతినిధులను సంప్రదిద్దామన్నా వారికి ఎలాంటి దారి దొరకడం లేదు. ఆన్‌లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లు కనీసం తమ సమస్యలను వినడానికి కూడా సిద్ధంగా లేవని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటక యాప్-బేస్డ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు ఇంతలా పెరుగుతున్నా స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాము యూనియన్ తరపున త్వరలోనే క్విక్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లన్నింటికీ లేఖలు పంపనున్నట్లు చెప్పారు. డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 14 గంటలు పనిచేసినా నికరంగా రూ.500 కూడా మిగలని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలు కూడా డెలివరీ బాయ్స్‌ను దెబ్బతీస్తున్నాయి. మొదట్లో ఆఫర్లతో ఆకర్షించి.. ఆ తర్వాత పేఅవుట్స్ తగ్గించేస్తున్నారని, కొన్నిసార్లు ఒక డెలివరీకి రూ.10 కూడా రావడం లేదని అలీ ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే కస్టమర్ రేటింగ్స్ బాలేవు అంటూ కంపెనీలు తప్పించుకుంటున్నాయన్నారు. ఈ పెట్రోల్ కష్టాల నుంచి గట్టెక్కడానికి 24 ఏళ్ల యువకులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తన స్నేహితులు కొందరు ఇప్పటికే ఈవీ స్కూటర్లకు మారారని, రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సంపాదన బాగా తగ్గిపోవడంతో సేవింగ్స్ పెంచుకోవడానికి ఇదొక్కటే మార్గమని భావిస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ డెలివరీ పేఅవుట్స్‌పై కఠినమైన నిబంధనలు తేవాలని గిగ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు.
