అష్టాచమ్మా టూ అంటే సుందరానికి

అష్టాచమ్మా టూ అంటే సుందరానికి

సరిగ్గా 14ఏళ్ల క్రితం అంటే సెప్టెంబర్ 5, 2008న అష్టాచమ్మా సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు, నేచురల్ స్టార్ నాని. ఈ రోజుకు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 14ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. తన 14ఏళ్ల సినీ కెరీర్ ను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసిన ఈ పిక్ లో నాని పూర్తిగా ఎరుపు రంగు లైట్ లో ఉండడాన్ని చూడవచ్చు. ఇక నాని మొదటి సినిమా తీసినపుడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది చిన్న సినిమా. కలర్స్ స్వాతి తప్ప ఆ సినిమాలో ఇంకెవరున్నారో కూడా ఎవరికీ సరిగా తెలియదు. కానీ విడుదల తర్వాత ఎవరూ ఎరుగని రీతిలో విజయాన్ని సాధించి... తెలుగు ప్రేక్షకులు దగ్గరవడం ప్రారంభించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నానిలో న‌టున్ని చూసిన డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతోనే ఈ రోజు నేచురల్ స్టార్ గా నాని మన ముందుకు వచ్చాడు.

ఆ తర్వాత చెప్పుకోవడానికి పెద్ద మార్కెటేమీ లేకపోయినా అడపా దడపా సినిమాలు చేసుకుంటూ నాని కెరీర్ లో బిజీ అయ్యాడు. రైడ్, భీమిలి కబడ్డీ జట్టు లాంటి సినిమాలు అంతగా ఆడపోయినా మంచి విజయమే సాధించాయి. 2011 హీరోగా నాని కెరీర్ నే మార్చేసింది. అలా మొదలైంది, పిల్ల జమిందార్ లాంటి విజయాలతో నానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక 2012లో వ‌చ్చిన ‘ఈగ‌’ సినిమాతో నాని నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొద‌లైంది. 2012 నుంచి 2015 మధ్యలో వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’, ‘పైసా’, ‘ఆహా క‌ళ్యాణం’, ‘జెండా పై క‌పిరాజు’.. ఇలా వ‌ర‌స సినిమాల‌యితే చేశాడు..  కానీ హిట్లు మాత్రం అందుకోలేదు. ఆ సమయంలోనే వచ్చిన సినిమా  ‘ఎవ‌డే సుబ్రమ‌ణ్యం’. 2015 మార్చి 21న ఈ చిత్రం విడుద‌లైంది. ఆ త‌ర్వాత ‘భ‌లేభ‌లే మగాడివోయ్‌’తో నాని కాస్తా నేచుర‌ల్ స్టార్ అయ్యాడు. ఈ 14 ఏళ్ళ ప్రయాణంలో ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’కు నంది.. ‘భ‌లేభ‌లే మ‌గాడివోయ్’ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును నాని సొంతం చేసుకున్నాడు.

అలా మళ్లీ జోరందుకున్న నాని సినిమాలు.. ‘కృష్ణగాడి వీర ప్రేమ‌గాధ’,‘జెంటిల్ మ‌న్’, ‘మ‌జ్ను’, ‘నేను లోక‌ల్’, ‘నిన్ను కోరి’, ‘ఎంసీఏ’ సినిమాల‌తో వ‌ర‌సగా 8 విజ‌యాలు అందుకున్నాడు. 2019లోవచ్చిన జెర్సీ సినిమా ఎంత సక్సెస్ ను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడు ఈ నేచురల్ స్టార్. దాని తర్వాత గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగ్ దీశ్ సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని తనలోని మరో హీరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించి అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఈ మధ్యే అంటే సుందరానికితో మంచి హిట్ కొట్టిన నాని... ప్రస్తుతం దసరా సినిమాతో బిజీగా ఉన్నాడు.  ఈ మూవీ నాని కెరీర్లోనే పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ మూవీ మార్చి 30, 2023న విడుదల కానున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు