ఒకే ఏడాది క్యాన్సర్​తో 9 లక్షల మంది మృతి

ఒకే ఏడాది క్యాన్సర్​తో 9 లక్షల మంది మృతి
  • ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్​
  •     2022 ఏడాది డేటా రిలీజ్ చేసిన డబ్ల్యూహెచ్​వో
  •     క్యాన్సర్ ఏజెన్సీ ఐఏఆర్​సీ వెల్లడి

 

న్యూడిల్లీ: ఇండియాలో 2022లో కొత్తగా 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదైనట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) ప్రకటించింది. 9.10 లక్షల మంది క్యాన్సర్ బారినపడిన పడి చనిపోయినట్టు తెలిపింది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణమైందని వెల్లడించింది. మగవాళ్లు ఎక్కువగా లిప్, ఓరల్, లంగ్ క్యాన్సర్ బారినపడుతున్నట్టు వివరించింది. పురుషుల్లో నోటికి సంబంధించిన క్యాన్సర్ కేసులు 15.60%, ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు 8.50% రికార్డైనట్టు ప్రకటించింది. ఇక, మహిళలు ఎక్కువగా బ్రెస్ట్, స‌‌‌‌‌‌‌‌ర్వైక‌‌‌‌‌‌‌‌ల్ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. మహిళల్లో నమోదవుతున్న వాటిల్లో 27% బ్రెస్ట్, 18% సర్వైకల్ క్యాన్సర్ కేసులే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు, మరణాలకు సంబంధించిన డేటాను డబ్ల్యూహెచ్​వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్​సీ) శుక్రవారం రిలీజ్ చేసింది. 

ఐదేండ్ల తర్వాత ప్రాణాలతో ఉన్నోళ్లు.. 

క్యాన్సర్ నిర్ధారణ అయిన ఐదేండ్ల తర్వాత కూడా ఇండియాలో ప్రాణాల‌‌‌‌‌‌‌‌తో ఉన్న వారి సంఖ్య 32.60 లక్షలుగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్​వో, ఐఏఆర్​సీ తన రిపోర్టులో తెలిపాయి. ఇండియాలో 75 ఏండ్లలోపు వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 10.60% కాగా, చనిపోయే ప్రమాదం 7.20 శాతంగా నమోదైంది.  ప్రపంచవ్యాప్తంగా 2022లో సుమారు 2కోట్లకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 97లక్షల మంది వరకు చనిపోయారు. ఐదుగురిలో ఒకరు క్యాన్సర్ బారినపడుతున్నారు. ప్రతీ 9 మంది పురుషుల్లో ఒకరు,  ప్రతీ 12 మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్​తో చనిపోతున్నారు. కాగా, 115 దేశాలకు సంబంధించిన క్యాన్సర్ రిపోర్టును డబ్ల్యూహెచ్​వో రిలీజ్ చేసింది. వీటిలో 39% దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నట్టు తేలింది.

పూనమ్ పాండే మృతి

మోడల్, రియాలిటీ టీవీ స్టార్, నటి పూనమ్  పాండే(32) ఇకలేరు. సర్వైకల్ క్యాన్సర్ తో పూనమ్​చనిపోయారని ఆమె మేనేజర్ నిఖితా శర్మ శుక్రవారం ప్రకటించారు. గతకొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ తో పోరాడుతూ శుక్రవారం ఉదయం మరణించారని తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితమే గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పూనమ్ కనిపించారు. ఇంతలోనే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోవడంతో ఆమె అభిమానులు, సినిమా నటులు దిగ్ర్భాంతికి గురయ్యారు. పూనమ్  చనిపోయిన విషయాన్ని ఆమె సోదరి వెల్లడించిందని ఆమె మీడియా మేనేజర్ పారుల్ చావ్లా తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చావ్లా చెప్పారు. అలాగే పూనమ్​ టీం కూడా ఆమె మృతిని ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ‘ఈరోజు (శుక్రవారం) మాకు ఓ దుర్దినం. సర్వైకల్  క్యాన్సర్ తో పూనమ్ చనిపోయారని తెలిసింది. ఆమె మృతిని నమ్మలేకపోతున్నాం” అని ఇన్ స్టాగ్రామ్ పేజీలో టీం పేర్కొంది.

ఇమ్యూనోథెరపీ బెస్ట్..

సర్వైకల్ క్యాన్సర్​కు ఇమ్యూనోథెరపీయే మెరుగై న చికిత్స అని తాజా పరిశోధనలో వెల్లడైంది. వ్యాధి ప్రారంభ దశలో ఈ చికిత్స వల్ల మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చని న్యూజెర్సీలోని క్యాన్సర్ ఇనిస్టిట్యూట్​ పరిశోధకులు తెలిపారు. మిగతా చికిత్సలతో పాటూ ఇమ్యూనోథెరపీ వల్ల కూడా పలు దుష్ప్రభావాలు ఎదురైనప్పటికీ.. ప్రస్తుతం ఉన్న థెరపీలలో ఇదే మెరుగైందన్నారు. వ్యాధి ప్రారంభంలో ఇమ్యూనోథెరపీ చేయడం ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంద ని గైనకాలజిక్ అంకాలజిస్ట్ ఈగ్వెనియా గిర్డా చెప్పారు. ఇమ్యూనోథెరపీ అంటే.. శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించేలా రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడమని ఆమె వివరించారు.