
జార్ఖండ్ రాజధాని రాంచీలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 27 శనివారం ఉదయం 30 మంది పిల్లలతో వెళ్తున్న బస్సు మందార్లోని సెయింట్ మారియా స్కూల్కు 100 మీటర్ల దూరంలో మలుపు వద్ద ప్రమాదానికి గురైంది.
గాయలైన చిన్నారులను సమీపంలోని మిషన్ ఆసుపత్రిలో చేర్చారు. పిల్లలలో ఒకరికి తలకు గాయమైందని, సిటీస్కాన్ చేయిస్తున్నామని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. స్కూల్ బస్సులో ఉన్న మిగతా పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సు అతివేగంగా ఉందని, డ్రైవర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈరోజు బస్సు 45 నిమిషాలు ఆలస్యమైంది. ఆ సమయాన్ని సరిచేయడానికి డ్రైవర్ వేగంగా బస్సు నడుపుతున్నాడని, అంతేకాకుండాఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.