
ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియో తగ్గించిన ఏఐసీటీఈ
హైదరాబాద్, వెలుగు: లెక్చరర్, స్టూడెంట్ రేషియోను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) తగ్గించింది. ప్రతి పదిహేను మంది స్టూడెంట్లకు ఒక లెక్చరర్ ఉండేలా రూల్స్ పెట్టింది. గతంలో 1:20గా ఉన్న రేషియోను ఇప్పుడు 1:15కు కుదించింది. డీమ్డ్ వర్సిటీలు, అక్రెడిటేషన్, అటానమస్ గుర్తింపు ఉన్న కాలేజీల్లోని టెక్నికల్ డిగ్రీ, పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను బుధవారం ఏఐసీటీఈ విడుదల చేసింది. అయితే, పీజీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1:12గా ఉన్న రేషియోను 1:15కు పెంచింది. రెండేళ్లలో అన్ని కాలేజీలూ న్యాక్ గుర్తింపు పొందాలని ఇప్పటికే ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో, వచ్చే ఏడాది వరకు అన్ని కాలేజీల్లోనూ 1:15 రేషియో అమల్లోకి వచ్చే అవకాశముంది.
లీజు బిల్డింగుల్లోనూ కాలేజీలు
ఇప్పటిదాకా సొంత స్థలం, బిల్డింగ్ ఉంటేనే కాలేజీలు పెట్టేందుకు అనుమతి ఇచ్చేవారు. అయితే, మెగా మెట్రో, మెట్రో సిటీల్లో భూమి కొరత నేపథ్యంలో లీజు తీసుకున్న స్థలం, బిల్డింగుల్లోనూ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు పెట్టుకునేందుకు ఇక నుంచి అనుమతి ఇవ్వనున్నట్టు ఏఐసీటీఈ ప్రకటించింది. 25 ఏళ్లకు లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అందుకు రాష్ట్ర సర్కారు, అనుబంధ యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కాలేజీలు, యూనివర్సిటీలను గ్రీన్ క్యాంపస్‌గా మార్చాలని, వ్యర్థ పదార్థాలను నివారించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. వర్షపు నీరు భూమిలో ఇంకేలా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించింది. చెరువుల క్యాచ్మెంట్ ఏరియాల్లో బిల్డింగులు కట్టకూడదన్న జీవో111కు విరుద్ధంగా కొనసాగుతున్న కాలేజీల గుర్తింపుపై మాత్రం ఏఐసీటీఈ క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై కాలేజీల నుంచి ఉన్నత విద్యాశాఖ వివరణ కోరగా, జేఎన్టీయూ పరిధిలోని 160 కాలేజీల్లో 70 కాలేజీలు మాత్రమే స్పందించాయి. దీంతో స్పందించని ఆయా కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై స్పష్టత కరువైంది.
కొత్తగా 39 ఆనర్స్ డిగ్రీలు
ఈ సారి కొత్త 39 ఆనర్స్ డిగ్రీలనూ ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులకు ఓకే చెప్పింది. అయితే, ఏఐసీటీఈ, వర్సిటీ ఇచ్చిన సీట్లకు లోబడే ఆనర్స్ డిగ్రీలను ఇవ్వాలని సూచించింది. ఇప్పటిదాకా డీమ్డ్ వర్సిటీల్లో ఓపెన్ అండ్ డిస్టెన్స్ కోర్సులు చెప్పేందుకు అనుమతి లేదు. అయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ వర్సిటీల్లోనూ డిస్టెన్స్ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతిచ్చింది. కానీ, కొన్ని కోర్సులకే దానిని పరిమితం చేసింది. మేనేజ్మెంట్ కోర్సులు, కంప్యూటర్ అప్లికేషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సుల్లో మాత్రమే డిస్టెన్స్ ఎడ్యేకేషన్కు పర్మిషన్ ఇచ్చింది.
ఏఐసీటీఈ చేసిన కొన్ని సిఫార్సులు
2020లో కొత్త కాలేజీలకు పర్మిషన్ ఇవ్వొద్దు. 2017–18లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో 49.8% సీట్లే నిండాయి. దీనిపై రెండేండ్ల తర్వాతే సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవాలి.
సంప్రదాయ కోర్సులైన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 40% సీట్లు కూడా భర్తీ కావట్లేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్లను పెంచకుండా సంప్రదాయ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంజనీరింగ్ చదివిన వారిలో క్వాలిటీ సరిగ్గా లేదు. దీనికి ఫ్యాకల్టీ కొరత, నాణ్యత లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కాబట్టి టీచింగ్ క్వాలిటీని పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలి. ఐఐటీ, ఎన్ఐటీ ఫ్యాకల్టీలతో శిక్షణ ఇప్పించాలి.
మల్టీ డిసిప్లినరీ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైస్సెస్, సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్ అండ్ డిజైన్ కోర్సులకూ ప్రాధాన్యం ఇవ్వాలి.