
న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదిపై భారత సరిహద్దు వెంబడి చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుపై అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూలై 9) జాతీయ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న మెగా డ్యామ్ భారత్‌కు ‘టిక్కింగ్ వాటర్ బాంబ్’ అని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రజల ఉనికికి ముప్పు కల్గిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ జల భాగస్వామ్య ఒప్పందంలో భాగం కావడానికి చైనా నిరాకరించడం ఈ ప్రాజెక్టును మరింత ఆందోళనకరంగా మారుస్తుందన్నారు. చైనాను ఎప్పుడు నమ్మలేమని.. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని.. ఈ ప్రాజెక్టును చైనా ఒక రకమైన నీటి బాంబుగా కూడా ఉపయోగించ్చొచని అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ జల పంపిణీ ఒప్పందాలపై చైనా సంతకం చేసి ఉంటే.. అరుణాచల్, అస్సాం, బంగ్లాదేశ్‌లలో రుతుపవనాల వరదలను నివారించడం వంటివి ఈ ఆనకట్టకు ఉండేవని.. కానీ అలాంటి ఒప్పందాలు లేకుంటే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
►ALSO READ | సన్ బాత్ చేస్తుండగా ట్రంప్‌ను చంపుతాం: ఇరాన్ అధికారి బెదిరింపులు
ఒకవేళ చైనా ఈ ఆనకట్ట నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే.. మొత్తం మన సియాంగ్ బెల్ట్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అరుణాచల్ ప్రభుత్వం సియాంగ్ ఎగువ బహుళార్ధసాధక ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయితే నీటి నిల్వ, వరద నియంత్రించవచ్చన్నారు. మెగా డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చైనా ఇప్పటికే ప్రారంభించింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను భారత్‌కు అందించలేదన్నారు. ఈ డ్యామ్ పూర్తి అయితే భారత్‌లో సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎడారులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన లేవనెత్తారు.