
'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. వారి నుంచి రాబోతున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha). అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది, అది కూడా 3డీ ఫార్మాట్‌లో అలరించనుంది. జూలై 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
విష్ణు - హిరణ్యకశిపుల యుద్ధం, ప్రహ్లాదుడి కథ
ఈ సినిమా ప్రచారంలో భాగంగా, చిత్ర బృందం బుధవారం 'మహావతార్ నరసింహ' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. విజువల్స్, గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రహ్లాదుడి చరిత్ర, భగవాన్ విష్ణువుకు , అసుర చక్రవర్తి హిరణ్యకశిపునికి మధ్య జరిగిన పౌరాణిక యుద్ధాన్ని అత్యంత ఆసక్తికరంగా చూపించనున్నారు. నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేయనున్నారు.
హోంబలే ఫిలిమ్స్ ప్రయోగం, అంచనాలు
హోంబలే ఫిల్మ్స్ సాధారణంగా యాక్షన్, డ్రామా చిత్రాలకు పేరుగాంచినప్పటికీ, యానిమేషన్ చిత్ర రంగంలోకి అడుగుపెట్టడం ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. భారతీయ పౌరాణిక కథలకు యానిమేషన్ రూపాన్ని ఇవ్వడం ద్వారా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. 3డీ ఫార్మాట్‌లో సినిమా విడుదల కావడం విజువల్ అనుభూతిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత, 'మహావతార్ నరసింహ' భారతీయ యానిమేషన్ చిత్రాలకు కొత్త నిర్వచనం ఇస్తుందని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి..
►ALSO READ | RGV Saaree : ఓటీటీలోకి ఆర్జీవీ 'శారీ'.. వివాదాస్పద చిత్రంపై మళ్లీ ఆశలు!