- టీజీసీహెచ్ఈ చైర్మన్, సెక్రెటరీతో వర్సిటీ అధికారుల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగించే విషయంలో విద్యార్థులకు తోడ్పాడునందించేందుకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ(యూడబ్ల్యూఏ) ముందుకొచ్చింది. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్‌తో ఆస్ట్రేలియా వర్సిటీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.
ఏవియేషన్, అగ్రికల్చర్, స్పేస్, క్రిటికల్ మినరల్స్ వంటి ప్రాధాన్యతా రంగాల్లో ఆస్ట్రేలియా–భారత్ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ అకాడమిక్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఉన్నత విద్య, పరిశోధనల కేంద్రంగా తెలంగాణ వేగంగా ఎదుగుతోందని, అంతర్జాతీయ వర్సిటీల సహకారంతో ఇక్కడి విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్ దొరుకుతుందని చెప్పారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ గ్లోబల్ గ్రోత్ అండ్ అడ్వకసీ డైరెక్టర్ నషీద్ చౌదరి, గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్ మేనేజర్ హరి పద్మనాభన్ తమ వర్సిటీ ద్వారా అందించే సహకారాన్ని వివరించారు. ఆధునిక పరిశోధనలకు, సాంకేతిక అభివృద్ధికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని వారు కొనియాడారు.
