ఒవైసీ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదో క్లారిటీ ఇచ్చిన హైడ్రా

ఒవైసీ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదో క్లారిటీ ఇచ్చిన హైడ్రా

చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల రక్షణే ధ్వేయంగా ఏర్పడిన హైడ్రా.. గ్రేటర్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తూ, ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపిస్తూవస్తోంది. ఎన్నో ఆక్రమణలను తొలగించిన హైడ్రా.. ఒవైసీ ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చివేయడం లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి.  దీనిపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది.

 ఫాతిమా కాలేజ్ ని సల్కం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించినందున తొలగిస్తామని గత సెప్టెంబర్ లో ప్రకటించామని.. కానీ పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తుందని.. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 

ఈ కాలేజీలో 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.. పేద ముస్లిం మహిళలకు వెనుకబాటి తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారని అన్నారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. 25 ఎకరాల చెరువును ఫ్లాట్లుగా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేసినట్లు చెప్పారు.

ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు వెయ్యి కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని.. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనపరుచుకున్నమని అన్నారు. సామాజిక కారణాలవల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.