ముషీరాబాద్, వెలుగు: రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా పుస్తకానికి ప్రాధాన్యం తగ్గడం లేదని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో బుధవారం బుక్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీని ప్రొఫెసర్ కోదండరాం, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తో కలిసి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి మరింత విలువ పెరిగిందన్నారు. పుస్తకాలు అనేవి మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే అద్భుతమైన కిటికీలన్నారు. వేరే ప్రపంచంలో విహరించేందుకు పుస్తకాలు ఎంతో దోహదపడతాయన్నారు. వ్యక్తిగత వికాసం, ఇతరుల జీవిత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి పఠనం ఒక వారధిలా ఉపయోగపడుతుందని తెలిపారు. బాహ్య ప్రపంచం వేగంగా మారినా పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ బుక్ ఫెయిర్ ద్వారా కొత్త పుస్తకాలతో పాటు ఆయా పుస్తకాల రచయితలను కలిసే అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, కార్యదర్శి వాసు తదితరులు పాల్గొన్నారు.
బుక్ డొనేషన్ బాక్స్ ప్రారంభం..
బుక్ ఫెయిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ బాక్స్ ను తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ఎస్.వి.సత్యనారాయణ ప్రారంభించారు. అంతకుముందు వేదికపై అనిచెట్టి రజిత పుస్తక స్ఫూర్తి ది న్యూనరేటివ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే చర్చ కార్యక్రమం జరిగింది. బుధవారం నగరంలోని వివిధ స్కూల్స్ విద్యార్థులతో బుక్ ఫెయిర్ ఆవరణ సదండిగా మారింది.
