హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్
  • జులై 14న 29 వేల రేషన్​కార్డులు పంపిణీ 
  • 9 సర్కిళ్ల పరిధిలో ఇవ్వనున్న సివిల్​ సప్లయీస్ ​శాఖ 
  • 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న అధికారులు  
  • రోజూ కొత్తగా 6 వేల అప్లికేషన్లు 
  • వెరిఫికేషన్​ వేగవంతానికి మిగతా శాఖల నుంచి సిబ్బంది  

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్త రేషన్​ కార్డుల కోసం గ్రేటర్ పరిధిలోని లక్షల మంది ఆతృతతో ఎదురుచూస్తుండడంతో ఈనెల14న కొత్త కార్డుల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 29,487 మందికి కార్డుల పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్​ వెల్లడించారు. అయితే, 14వ తేదీన ఇచ్చే కార్డులు వెరిఫికేషన్​పూర్తయినవి మాత్రమేనని, దరఖాస్తులు, వెరిఫికేషన్, పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని తెలిపారు. కార్డులు పొందిన వారికి సెప్టెంబర్​నుంచి సరుకుల పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల్లో కూడా కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. 

 ఏడాదిలో లక్ష కొత్త కార్డులు 

ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రేషన్​కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని ప్రకటించడంతో రోజుకు దాదాపు 5 వేల నుంచి 6 వేల దరఖాస్తులు మీసేవా కేంద్రాల్లో నమోదవుతున్నాయంటున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను సర్కిళ్ల వారీగా ఏఎస్​ఓలు పరిశీలించి వెరిఫికేషన్ పనులను ఆర్ఐలకు అప్పగిస్తున్నారు. వారు దరఖాస్తుదారులు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? కార్డు ఇవ్వడానికి అర్హులేనా? కాదా అన్నవిషయాలను పరిశీలించి ఏఎస్ఓకు నివేదిక ఇస్తున్నారు. ఏఎస్​వోలు డీఎస్​ఓకు రిపోర్ట్​ఇస్తారు. తర్వాత ఆ కార్డులకు చీఫ్​ రేషనింగ్​ఆఫీసర్​( సీఆర్​ఓ) ఆమోదం తెలుపుతారు. ప్రస్తుతం హైదరాబాద్​నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 6,39,451 కార్డులున్నాయి. మరో ఏడాదిలో లక్షకు పైగానే కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. 

సిబ్బంది కొరత కారణంగా ఆలస్యం

నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో కొత్త రేషన్​కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి పౌరసరఫరాల శాఖకు అవసరమైన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. రోజుకు వేలల్లో దరఖాస్తులు వస్తున్నా వెరిఫికేషన్​ చేసేందుకు అవసరమైన సిబ్బంది లేరని, అందుకే ఆలస్యమవుతోందంటున్నారు. దీంతో వెరిఫికేషన్​పనులకు కొందరు ఆఫీసర్లను ఇవ్వాల్సిందిగా బల్దియా, రెవెన్యూ శాఖలకు లెటర్లు రాశారు. 

వారు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉండడంతో పని స్పీడప్​చేస్తామంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండున్నర లక్షల దరఖాస్తుల్లో 10శాతం మాత్రమే వెరిఫికేషన్​ పూర్తయ్యిందంటున్నారు. మరో రెండు నెలలు రేషన్​పంపిణీ లేనందున పూర్తిగా కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్​పైనే దృష్టి పెడతామంటున్నారు.