
భారతదేశంలో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి స్పేస్ ఎక్స్ కు తుది అనుమతి లభించింది. ఇది భారతదేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ముఖ్యమైన ముందడుగు.
IN-SPACe స్టార్‌లింక్‌కు వారి Gen1 ఉపగ్రహాల ద్వారా భారత దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తుది అనుమతి ఇచ్చింది. అంటే త్వరలో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలో అందుబాటులోకిరానున్నాయి.ఐదేళ్ల పాటు అంటే జూలై 7, 2030 వరకు లేదా Gen1 ఉపగ్రహాల సేవ జీవితం ముగిసే వరకు స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
2022 నుంచి భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. గత నెలలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి కీలకమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ పొందింది. IN-SPACe నుంచి వచ్చిన ఈ తాజా అనుమతితో స్టార్‌లింక్‌కు భారతదేశంలో సేవలను ప్రారంభించడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి.
IN-SPACe అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అన్ని తనిఖీలను నిర్వహించిన తర్వాత స్టార్‌లింక్‌కు అనుమతిచ్చింది. ఇది భారతదేశం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగాన్ని సరళీకరించేందుకు చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఒక భాగం అని చెప్పొచ్చు.
అనుమతి లభించినప్పటికీ స్టార్‌లింక్ వెంటనే సేవలను ప్రారంభించదు. ఇంకా కొన్ని కీలక దశలు ఉన్నాయి:
- భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ (రేడియో తరంగాలు) కేటాయింపు పొందాలి.
- సేవలను అందిచేందుకు అవసరమైన గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి.
- భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించేందుకు టెస్టింగ్స్,ట్రయల్స్ నిర్వహించాలి.
- స్టార్‌లింక్‌తో పాటు భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రధాన పోటీదారులుగా భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఉన్నాయి. ఇప్పటికే యూటెల్సాట్ వన్ వెబ్ (OneWeb) (భారతీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో) ,రిలయన్స్ జియో (Reliance Jio) SESతో కలిసి అనుమతులు పొందాయి.
ప్రాథమిక ధర అంచనా: నివేదికల ప్రకారం..స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్‌ల ధర సుమారు రూ.33,000 ఉండవచ్చు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు రూ.3వేల నుంచి రూ.4వేల200 మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రారంభంలో ఒక నెల ఉచిత ట్రయల్ కూడా అందించే అవకాశం ఉంది.
►ALSO READ | మీ వాట్సాప్ చాట్‌లకు పర్సనల్ టచ్..AIతో అద్భుతమైన వాల్‌పేపర్లు
భారతదేశానికి ప్రయోజనాలు: స్టార్‌లింక్ సేవలు భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు అధిక-వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని లేదా ఖరీదైన ప్రాంతాల్లో ఇది గేమ్-ఛేంజర్‌గా మారగలదు.
స్టార్‌లింక్ ప్రవేశం భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం,డిజిటల్ ఇండియా విజన్‌ను సాధించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనా. స్టార్ లింక్ సేవలు రాబోయే కొన్ని నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.