రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తా.. వేదాలు, ఉపనిషత్తులు చదువుతా: కేంద్రమంత్రి అమిత్ షా

రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తా.. వేదాలు, ఉపనిషత్తులు చదువుతా: కేంద్రమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూలై 9) రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు చెందిన మహిళలు, కార్యకర్తలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత జీవితాంతం వేదాలు, ఉపనిషత్తులు పఠించడానికి సమయం కేటాయిస్తానని తెలిపారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేస్తానని చెప్పారు.

 రసాయనికంగా పండించిన గోధుమల వల్ల క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తాయన్నారు. రసాయన ఎరువులు లేకుండా పండించిన ఆహారం తింటే ఎలాంటి వ్యాధులు రావని.. మందులు అవసరం ఉండదని అన్నారు. సేంద్రియ వ్యవసాయం వ్యాధులను తగ్గించడమే కాకుండా పంట ఉత్పాదకతను కూడా పెంచుతోందన్నారు అమిత్ షా.

 నా పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని.. రసాయన ఎరువులు వాడిన దానికంటే పంట దిగుబడి దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా వస్తోందని తెలిపారు. భారీగా వర్షాలు కురిసినప్పుడు సాధారణంగా పొలం నుంచి నీరు బయటకు వెళ్తుంది కానీ సేంద్రీయ వ్యవసాయంతో ఒక్క చుక్క కూడా బయటకు పోదని నీరు నేలలోకి ఇంకిపోతుందన్నారు. 

►ALSO READ | చరిత్ర సృష్టించిన Nvidia: ఇండియా GDP ని దాటిన కంపెనీ మార్కెట్‌క్యాప్

హోం మంత్రి అయినప్పుడు అందరూ నాకు చాలా ముఖ్యమైన శాఖ దక్కిందనుకున్నారు. కానీ సహకార మంత్రిగా నియమితులైన రోజు నాకు మరింత గొప్ప బాధ్యత అప్పగించబడిందని నేను భావించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే- అది దేశ రైతులు, పేదలు, గ్రామాలు, జంతువులకు సేవ చేసే శాఖ అని పేర్కొన్నారు.