కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు చేపట్టిన వేర్వేరు ఆపరేషన్లలో 15 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ‘ఆపరేషన్ రద్దుల్ ఫితనా-3’లో భాగంగా మస్తుంగ్, బోలన్, వాషుక్, అవరాన్, సిబి, ఖుజ్దార్, హర్నాయ్, నుష్కి ప్రాంతాల్లో ఈ ఆపరేషన్లు చేపట్టినట్లు పాక్ స్టేట్ మీడియా ఆదివారం తెలిపింది. ఈ ఆపరేషన్లలో హతమైన టెర్రరిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యలతో నిషేధిత టెర్రర్ గ్రూపుల నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని పాక్ మీడియా పేర్కొంది.
నిషేధించిన టెర్రర్ సంస్థలను సూచించేందుకు పాక్ ప్రభుత్వం ‘ఖవారిజ్’ అనే పదాన్ని వాడుతోంది. తిరుగుబాటు గ్రూపులు వరుసగా దాడులు చేస్తుండటంతో బలూచిస్థాన్‌లో గత నెల నుంచి ఆర్మీతో పాటు భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నాయి. ముఖ్యంగా జులై 6న జియారత్‌లో జరిగిన ఘటనలో 27 మంది పోలీసులు చనిపోయారు.
