నిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి

నిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి

నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు చేసి పంటలు వేసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏటా అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లాలో జరిగిన పంటల నష్టంపై వ్యవసాయ శాఖ సర్వేలు చేసి నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం పరిహారం అందించడంలేదు. 

ఫసల్ బీమా అమలు చేస్తలే..

రెండేండ్ల కాలంలో ఏడు సార్లు అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది. మూడు రోజుల‌ ఈదురు గాలులతో కురుస్తిన్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతేడాది అల్పపీడన ద్రోణితో ఒకే సీజన్ లో ఆరు సార్లు పంటలు పాడైపోయాయి. 25 వేల ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగింది. జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు 10 వేల ఎకరాల పంటలు మాత్రమే మునిగినట్లు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 2016 సీజన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ ఫసల్​బీమా యోజన మాత్రం అమలు చేస్తలేరు. దీంతో రైతులకు పరిహారం అందక ఆర్థికంగా చితికిపోతున్నారు.

ముంచిన వాన..

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో సుమారు 5.5 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ, పత్తి, సోయా, కంది, వరి, పెసర, నువ్వులు లాంటి పంటలను సాగు చేస్తున్నారు. అయితే, అకాలవర్షాలతో 15 వేల ఎకరాల్లో పంట నష్షం జరిగింది. ‌సుమారు 6 వేల ఎకరాల్లో మక్కజొన్న, వరి, పప్పు దినుసులు మరో 6 వేల ఎకరాల్లో ఆరబెట్టిన పసుపు పాడైపోయింది. మిగతా 3 వేల ఎకరాలు ఇతర పంటలున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో 3 వేల ఎకరాల్లో వరి, పత్తి, మక్క జొన్న పంటలు  దెబ్బతిన్నాయి.