కోపదారి పూజారులు.. ఏది దొరికితే దానితో భక్తులను పొట్టుపొట్టు కొట్టారు.. వీడియో వైరల్ !

కోపదారి పూజారులు.. ఏది దొరికితే దానితో భక్తులను పొట్టుపొట్టు కొట్టారు.. వీడియో వైరల్ !

కొల్హాపూర్: భక్తులు ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తుంటారు. గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ఆలయంలోనే ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలు చెలరేగితే భక్తులకు మరింత చికాకుగా ఉంటుంది. భక్తులకు అలాంటి పరిస్థితి, చేదు అనుభవం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జ్యోతిబా ఆలయంలో ఎదురైంది. ఆలయంలోని పూజారులే భక్తులపై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దాదాపు 15 నుంచి 20 మంది పూజారులు ఇద్దరు భక్తులపూ విచక్షణా రహితంగా దాడి చేశారు.

ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యన ఈ గొడవ జరిగింది. ప్రదక్షిణ, హారతి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు దురుసుగా ప్రవర్తించడం వల్లే ఈ గొడవ జరిగిందని.. హారతి సమయంలో గొడవ చేయొద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదని.. పైగా పూజారులపై గులాము రంగు చల్లి గొడవగొడవ చేశారని ఆలయ అధికారులు తెలిపారు. ఎంత చెప్పినా వినకపోవడంతో దాదాపు 15 నుంచి 20 మంది పూజారులు ఈ గొడవకు కారణమైన ఇద్దరు భక్తులను ఆలయంలో నుంచి బయటకు లాక్కొచ్చారు. పిడి గుద్దులతో దాడి చేశారు. కాళ్లతో తన్నారు.

ఈ గొడవ చూసిన భక్తులు భయంతో బెంబేలెత్తిపోయారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాడిలో గాయపడిన ఇద్దరు భక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వాళ్లను పట్టుకుని మరీ పూజారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో ఈ ఘటనపై కొల్హాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన పూజారులను గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆలయ పవిత్రతను కాపాడటానికే పూజారులు అలా వ్యవహరించారని ఆలయ కమిటీ వాదిస్తుండగా.. స్థానిక భక్తుల నుంచి పూజారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం గమనార్హం. ఆ భక్తులు తప్పుచేస్తే వారిని పోలీసులకు అప్పగించాలని.. అంతే గానీ విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని పూజారుల తీరుపై భక్తులు మండిపడ్డారు.