V6 News

మొరాకోలో ఒక్కసారిగా కుప్పకూలిన రెండు భవనాలు.. 19 మంది మృతి..

 మొరాకోలో ఒక్కసారిగా కుప్పకూలిన రెండు భవనాలు.. 19 మంది మృతి..

మొరాకోలోని అత్యంత రద్దీగా ఉండే పురాతన నగరాల్లో ఒకటైన ఫెజ్(Fez)లో బుధవారం రెండు పక్కపక్కనే ఉన్న నాలుగు అంతస్తుల ఇళ్లు కూలిపోవడంతో సుమారు 19 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు.  అల్-ముస్తాక్బాల్ ప్రాంతంలోని ఈ భవనాలలో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనాలు చాలా కాలంగా సరిగా పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.

ఫెజ్ ప్రిఫెక్చర్ ప్రకారం.. స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది, పౌర రక్షణ బృందాలు  సంఘటనా స్థలానికి వెంటనే  చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం  రక్షణ కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్ర ప్రసార సంస్థ SNRT తెలిపిన ప్రాథమిక అంచనాల ప్రకారం, కూలిపోయిన భవనాలు కొంతకాలంగా శిథిలావస్థకు  చేరిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఎనిమిదవ శతాబ్దం నాటి మాజీ సామ్రాజ్య రాజధాని అయిన ఫెజ్‌లో ఈ విషాదం జరిగింది. సరిగ్గా రెండు నెలల క్రితం, ఈ నగరంలో జీవన పరిస్థితులు క్షీణించడం, నిరుద్యోగం, ప్రజా సేవల వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఎక్కువగా యువత చేపట్టిన ఈ ఆందోళనలు ఆ తర్వాత గ్రామీణ పట్టణాలకు కూడా వ్యాపించాయి. అక్కడ ఈ నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి.  

భవనం కూలిపోవడంపై విచారణలో నిర్మాణంలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ప్రమాదానికి గురైన భవనాల భద్రత గురించి అధికారులకు ముందే హెచ్చరికలు చేసారా లేదా అనే అంశాలపై పరిశీలించనున్నారు.