స్మార్ట్ ఫోన్ కొనేందుకు రక్తాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 16ఏళ్ల బాలిక

స్మార్ట్ ఫోన్ కొనేందుకు రక్తాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 16ఏళ్ల బాలిక

ప్రజెంట్ జనరేషన్ మనిషి పక్కన లేకపోయినా పర్లేదు గానీ.. ఫోన్ ఉంటే చాలు అనేలా తయారైంది. ఎక్కడికెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లడం మామూలైపోయింది. దానికి వయసుతో సంబంధం అస్సలు లేకుండా పోయింది. మొబైల్ ఫోన్ వాడడం కోసం, దాని కోసం ఏమైనా చేసే దీన స్థితికి చేరుకున్నాం. అలాంటి దుస్థితిని ప్రస్ఫుటించే ఓ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. 16ఏళ్ల బాలిక స్మార్ట్ ఫోన్ కొనేందుకు తన రక్తాన్నే అమ్మేందుకు సిద్ధమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక ఇటీవలే రూ.9వేల విలువైన ఓ మొబైల్ ఫోన్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. ఆర్డర్ అయితే చేసింది కానీ.. దానికి తగిన డబ్బు ఆమె దగ్గర లేకపోయేసరికి ఆలోచనలో పడింది.

డబ్బు పొందడం కష్టంగా భావించిన ఆ బాలిక... తన రక్తాన్ని అమ్మేందుకు నిర్ణయించింది. వెంటనే బాలూరాఘట్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లి, అక్కడి సిబ్బందిని కలిసింది. డబ్బులిస్తే రక్తం ఇస్తానని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారం అందించారు. అనంతరం ఆ బాలిక అసలు రక్తం ఎందుకు అమ్మాలనుకుంటోందో ఆరా తీశారు. ముందు తన సోదరుడి చికిత్స కోసం ఆ బాలిక అబద్దం చెప్పినా.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు కోసమని చెప్పడం విని అధికారులు షాకయ్యారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.