
బీజేపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 1,603 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకాగా శనివారం వరకు ఆరురోజుల్లో 3,223 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తు చేసేకునేందుకు ఆదివారంతో గడువు ముగియనుంది. చివరి రోజు భారీగానే దరఖాస్తులు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరు రోజుల్లో పార్టీ ముఖ్య నేతలు పెద్దగా దరఖాస్తు చేసుకోలేదు. వాళ్లంతా ఆదివారమే అప్లై చేసుకునే అవకాశం ఉంది.
మూడు కౌంటర్ల ఏర్పాటు
అప్లై చేసుకునేందుకు ఊహించని రీతిలో శనివారం ఆశావహులు రావడంతో బీజేపీ స్టేట్ ఆఫీసు కిటకిటలాడింది. అక్కడి కౌంటర్ సరిపోలేదు. దీంతో సుమారు 250 వరకు టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకున్నారు. అయినా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడంతో కౌంటర్లను మూడుకు పెంచారు. అయినా ఇబ్బంది తప్పలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆదివారం మూడు కౌంటర్లను కొనసాగించనున్నారు. ఇదే సమయంలో చివరి రోజున కేవలం దరఖాస్తులు తీసుకోవడం వరకే పరిమితం చేయాలని, సమయం ముగిసిన తర్వాతనే వాటన్నింటిని ఒకేసారి రికార్డుల్లో రాయాలని నిర్ణయించారు. ఒక్కో దరఖాస్తును రికార్డుల్లో రాయడంతో ఆలస్యం అవుతున్నదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దరఖాస్తుల కమిటీ సభ్యుడు దాసరి మల్లేశం చెప్పారు.
ఈటల, రఘునందన్ సహా..
శనివారం దరఖాస్తులు చేసుకున్న వాళ్లలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా తమ పీఏల ద్వారా దరఖాస్తులను పార్టీ స్టేట్ ఆఫీసుకు పంపించారు. వీరితో పాటు మాజీ మంత్రి శంకర్ రావు కూతురు సుష్మిత కంటోన్మెంట్ నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి షాద్ నగర్ నుంచి పోటీకి అప్లై చేసుకున్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ నుంచి పోటీకి జితేందర్ రెడ్డి దరఖాస్తు చేసుకోగా...శనివారం ఆయన కొడుకు మిథున్ రెడ్డి షాద్ నగర్ నుంచి పోటీకి అప్లయ్ చేసుకున్నారు. భువనగిరి టికెట్ కోసం గూడూరు నారాయణ రెడ్డి, సంగారెడ్డి టికెట్ కోసం విఠల్, సనత్ నగర్ టికెట్ కోసం మహిళా మోర్చ జాతీయ నాయకురాలు ఆకుల విజయ, శేర్ లింగంపల్లి టికెట్ కోసం గజ్జెల యోగానంద్, నారాయణఖేడ్ టికెట్ కోసం సంగప్ప దరఖాస్తు చేసుకున్నారు.
బీజేపీలో జిల్లా ఇన్‌చార్జ్‌లు, పార్లమెంట్ ప్రభారీల నియామకం
రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, 33 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమించారు. ఆదిలాబాద్ లోక్‌సభ సీటుకు అల్జాపూర్ శ్రీనివాస్, హైదరాబాద్‌కు గోలి మధుసూదన్ రెడ్డి, జహీరాబాద్‌కు బద్దం మహిపాల్ రెడ్డి అపాయింట్ అయ్యారు. పార్టీలో కీలకంగా పనిచేస్తున్న 50 మంది నేతలకు పదవులు దక్కాయి.
మున్నూరు కాపులకు టికెట్లు ఇవ్వండి..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున రాష్ట్రంలోని 36 మంది మున్నూరు కాపులకు టికెట్ల ఇవ్వాలని ఆ సామాజిక వర్గ ప్రతినిధులు కోరారు. శనివారం రాష్ట్రంలోని ఎవరికి.. ఎక్కడ.. టికెట్ ఇవ్వాలనే దానిపై 36 మంది పేర్లతో కూడిన జాబితాను కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, సహా ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌ను కలిసి మున్నూరు కాపు మహాసభ ప్రతినిధులు అందజేశారు.