హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత

హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత
  • సమగ్ర శిక్షా అభియాన్​ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు మినిట్స్​లో కేంద్రం వెల్లడి
  • ఈ అకడమిక్​ ఇయర్​కు రూ.1,787 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం  
  • పెండింగ్ సివిల్ వర్క్స్ డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల ఖాళీలపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంక్షన్డ్ పోస్టుల్లో 16,122 ఖాళీలున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరాల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో 11,348, సెకండరీ స్థాయిలో మరో 4,774 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. కాగా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో 6,852 టీచర్లు ఎక్కువగా ఉన్నట్టు లెక్కగట్టారు. 2022–23 అకడమిక్ ఇయర్​కు సంబంధించి ఏప్రిల్ 20న జరిగిన సమగ్ర శిక్షా అభియాన్​ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏబీ) సమావేశానికి సబంధించిన మినిట్స్​ను కేంద్ర విద్యాశాఖ రాష్ట్రానికి పంపింది. ఇందులో కేంద్ర రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.  ప్రైమరీ, అప్పర్​ప్రైమరీ స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు పెరిగినందున.. అవసరం మేరకు టీచర్ల రేషనలైజేషన్ చేయాలని సూచించింది. హైస్కూల్ లెవెల్​లోనూ సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు పేర్కొంది. 79 శాతం హైస్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్లు ఉన్నారని, సోషల్ లో 76 మంది స్టూడెంట్లకు ఒక టీచర్ ఉన్నట్టు లెక్కల్లో చూపించారు. 

రాష్ట్రానికి రూ.1787 కోట్లు.. 

2022–23 అకడమిక్ ​ఇయర్​కు రాష్ట్రానికి రూ.1,787 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం తన వాటా కింద రూ.1072.14 కోట్లు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.714.76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం ఇచ్చే దాంట్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​కు రూ. 880 కోట్లు, సెకండరీ, సీనియర్ సెకండరీకి రూ.183 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్ కు రూ.9.02 కోట్లు విభజిస్తారు. గతేడాది 952 సివిల్ వర్క్స్ పెండింగ్​లో ఉండగా, వాటిలో107 మాత్రమే పూర్తి చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దీంతో డిసెంబర్ 31లోగా మిగిలిన  845 వర్క్స్​ను కంప్లీట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. 

డ్రాపౌట్స్ పెరిగాయి..

కేంద్రం వెల్లడించిన పీఏబీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో హైస్కూళ్లలో మధ్యలోనే బడి మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. నిరుడు14 శాతం ఉన్న డ్రాపౌట్స్ ఈ సారి14.03 శాతానికి పెరిగాయి.  
పీఏబీలోని కొన్ని కీలకాంశాలు..

కొత్తగా 20 కేజీబీవీలు మంజూరు కాగా వాటి లో ఆదిలాబాద్ 1, జగిత్యాల 2, కరీంనగర్ 2, మహబూబ్ నగర్ 1, మహబూబాబాద్ 1, మెదక్ 4, నిజామాబాద్ 2, సంగారెడ్డి 5, సిద్దిపేట1, వికారాబాద్1 ఉన్నాయి. మరో 37 కేజీబీవీలను కేంద్రం అప్​గ్రేడ్ చేసింది.  

34 ఎంఆర్సీ బిల్డింగ్​ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వాటిలో  మంచిర్యాల 2, నిర్మల్1, నిజామాబాద్ 8, పెద్దపల్లి 2, భద్రాద్రి కొత్తగూడెం 3, వరంగల్ 1, రాజన్న సిరిసిల్లా 2, మెదక్ 5, సిద్దిపేట 3, మేడ్చల్ 7 భవనాలు ఉన్నాయి. 

42 స్కూళ్లలో ఒకేషనల్ ఎడ్యుకేషన్​ ప్రారంభం, రాష్ట్రవ్యాప్తంగా 94 స్కూళ్లలో ఐసీటీ ల్యాబ్స్ ఏర్పాటు, 467 ఉమ్మడి మండల కేంద్రాల్లో ఐసీటీ ఫెసిలిటీస్ కేంద్రం ఓకే చెప్పింది.