- ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల
హైదరాబాద్, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ అయిన 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పోను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రారంభించారు. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈ ఎక్స్‌పోను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందని, గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో తెలంగాణ ముందువరుసలో ఉందని తెలిపారు. టెక్నాలజీలతో తక్కువ సమయంలో శ్రమ లేకుండా పని చేయవచ్చని, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వ్యవసాయంతోపాటు వ్యవసాయేతర పరిశ్రమలకూ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల అన్నారు.
ఫార్మా, సీడ్, వ్యవసాయ రంగాలలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో పని చేస్తోందని చెప్పారు. పౌల్ట్రీ రంగంలోని కొత్త పద్ధతులను, అధునాతన టెక్నాలజీలను ప్రదర్శించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. బ్రీడింగ్, హాచరీ ఆటోమేషన్, ఫీడ్ మిల్లింగ్, వెటర్నరీ ప్రొడక్ట్స్, హౌసింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వంటి విభాగాలలో కొత్త పరికరాలను, టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు.
