
ఖమ్మం బాలిక ఘటనలో పోలీసులకు సమాచారం ఇవ్వని డాక్టర్లు
హాస్పిటల్‌కు షోకాజ్ నోటీస్ఇస్తామన్న డీఎంహెచ్‌వో
ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారయత్నం, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలోఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీ పూజ హాస్పిటల్ డాక్టర్లు, నిర్వాహకులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 19న తెల్లవారుజామున ఘటన జరగ్గా, అదే రోజు బాలికను చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని ఇంటి యజమాని అల్లం సుబ్బారావు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఒళ్లంతా కాలిన గాయాలతో బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వెంటనే చికిత్స అందించారు. తర్వాతైనా డాక్టర్లు ఈ ఇష్యూను మెడికో లీగల్ కేసుగా గుర్తించి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే ప్రశ్నలకు వారి నుంచి సరైన సమాధానం లభించడం లేదు. సోమవారం సాయంత్రం పోలీస్‌కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో డీఎంహెచ్‌వో సమక్షంలోనే డాక్టర్లపై సీరియస్అయ్యారని సమాచారం. శాఖాపరంగా రిపోర్ట్ ఇస్తే డాక్టర్లపై యాక్షన్ తీసుకుంటామని డీఎంహెచ్‌వో మాలతితో సీపీ చెప్పారు. ఇక డీఎంహెచ్‌వో కూడా ఆస్పత్రి నిర్లక్ష్యంపై షోకాజ్‌నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు.
పలు చట్టాల కింద కేసుల నమోదు
ఈ ఘటనలో అత్యాచారయత్నం, హత్యాయత్నంతోపాటు బాలకార్మిక చట్టాలు కూడా వర్తించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోక్సో చట్టం కింద అల్లం మారయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదమూడేళ్ల బాలికను పనిలో పెట్టుకోవడంపై అల్లం సుబ్బారావు కుటుంబసభ్యులపై బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం కింద శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులకు వన్ టౌన్పోలీసులు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు, సుబ్బారావు కుటుంబసభ్యులను విచారించిన తర్వాత ఆ శాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు. రెండున్నర వారాల క్రితం జరిగిన ఘటనను కప్పిపుచ్చేందుకు కుల పంచాయితీ పెద్దలను ఆశ్రయించిన అంశంపై తమకు సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.లక్షన్నర డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని, ఆ డబ్బులు ఇంకా ఇవ్వకపోవడం, ఈలోగానే పోలీసులకు ఉప్పందడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఆ తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ కుమార్తెపై అత్యాచార యత్నం, ప్రతిఘటించిన సమయంలో మారయ్య పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పారు. సుబ్బారావు కుటుంబసభ్యులు మాత్రం పూజ గదిలో దీపం ప్రమిదలను సరిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బట్టలకు నిప్పంటుకుందని వాదిస్తున్నారు.
ఉస్మానియాకు బాలిక..
ఇన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జడ్జి వాంగ్మూలం రికార్డు చేసుకున్న తర్వాత, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డీఎంహెచ్‌వో మాలతిలు చర్చించి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకువెళ్లారు. బాలిక ఒంటి మీద మెడ కింద నుంచి కాళ్ల వరకు 70 శాతం కాలిన గాయాలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు నిందితుడు అల్లం మారయ్యను మంగళవారం వన్ టౌన్పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడిని 14 రోజుల రిమాండ్ కు పంపించారు.
For More News..