ఏడాదిన్నర బాబుకు కరోనా పాజిటివ్..తల్లికి నెగిటివ్

ఏడాదిన్నర బాబుకు కరోనా పాజిటివ్..తల్లికి నెగిటివ్

కుత్బుల్లాపూర్, వెలుగు: హైదరాబాద్​ శివార్లలోని కుత్బుల్లాపూర్​లో ఓ ఏడాదిన్నర పిల్లాడికి కరోనా పాజిటివ్​రాగా.. అతని తల్లికి మాత్రం నెగిటివ్​ వచ్చింది. ఆమె అత్తగారి ఫ్యామిలీ, తల్లిగారి ఫ్యామిలీల్లో అందరికీ వైరస్​ సోకినా ఆమెకు రిజల్ట్స్​లో నెగిటివ్​ వచ్చింది. డాక్టర్లు మరోసారి ఆమె శాంపిల్స్​ టెస్టులకు పంపించారు. కుత్బుల్లాపూర్​కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల కింద ఢిల్లీ వెళ్లొచ్చాడు. తర్వాత తీవ్ర జ్వరంతో లోకల్​గా ట్రీట్​మెంట్​ ​చేయించుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో గాంధీ హాస్పిటల్​కు వెళ్లగా కరోనా అని తేలింది. అక్కడే ట్రీట్​మెంట్​తీసుకుంటూ చనిపోయాడు. తర్వాత చేసిన టెస్టుల్లో ఆయన ఫ్యామిలీలో అందరికీ కరోనా పాజిటివ్​వచ్చింది. కానీ ఆ ఇంటి కోడలు మాత్రం టెస్టులు చేయించుకోకుండా ఏడాదిన్నర బాబును తీసుకుని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను ట్రేస్​ చేసి తల్లిగారింటికి వెళ్లగా.. మళ్లీ తప్పించుకుని తెలిసినవారి ఇంట్లో ఆశ్రయం పొందింది. అధికారులు తల్లిగారింటి వారికి టెస్టులు చేయించగా అందరికీ కరోనా పాజిటివ్​ వచ్చింది. చివరికి ఆమెను గుర్తించారు. ఆమెకు, బాబుకు టెస్టులు చేయించగా.. బాబుకు పాజిటివ్​ వచ్చింది, ఆమెకు మాత్రం నెగిటివ్​ వచ్చింది. ఆమెకు ఇమ్యూనిటీ పవర్​కారణంగా వైరస్​అటాక్​కాలేదా, లేక వచ్చి తగ్గిపోయిందా అనేది డాక్టర్లు పరిశీలిస్తున్నారు.