మోడీ హ్యాపీగా లేరు: భారత సుంకాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మోడీ హ్యాపీగా లేరు: భారత సుంకాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, తన మధ్య రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, రష్యాతో భారత్ చమురు వ్యాపారం కొనసాగించడం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దెబ్బ తీస్తోందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం (జనవరి 6) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత ప్రధాని మోడీతో తనకు చాలా మంచి సంబంధం ఉంది. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందున ఇండియా భారీగా సుంకాలు ఎదుర్కొంటుంది. ఈ విషయంలో మోడీ తనపై అసంతృప్తిగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.  

కాగా, ఆదివారం (జనవరి 4) కూడా ట్రంప్ భారత సుంకాలపై హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు దిగుమతి వ్యవహారంపై ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో భారత్ తమకు సహకరించకపోతే.. భారతీయ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను మరింత పెంచుతామని అన్నారు. 

రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్‌‌‌‌‌‌‌‌పై వేగంగా మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉన్నదని చెప్పారు. ‘‘బేసికల్‌‌‌‌‌‌‌‌గా ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మనం వారిపై వేగంగా సుంకాలను విధించొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  

►ALSO READ | రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‎కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్

కాగా, ఇండియాపై ట్రంప్ 50 శాతం వాణిజ్య సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు, మరో 25 శాతం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారన్న సాకుతో మొత్తం 50 శాతం టారిఫ్స్ వడ్డీంచారు. దీంతో భారత్–అమెరికా మధ్య టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాలు వాణిజ్య చర్చలు జరుపుతున్నాయి.  ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

భారతదేశం–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇప్పటివరకు ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ భారత్‌‌‌‌‌‌‌‌పై సుంకాలు విధిస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.