రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‎కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్

రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‎కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్

బొగోటా: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెనిజులాపై దాడి చేసి ఏకంగా బెడ్ రూమ్ నుంచి అమెరికా దళాలు మదురోను ఎత్తుకెళ్లడంతో యావత్ ప్రపంచ దేశాలు విస్మయానికి గురయ్యాయి. అమెరికా సైనిక బలప్రదర్శనను మెజార్టీ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‎కు సవాల్ విసిరారు. రా.. దమ్ముంటే మదురో మాదిరిగా నన్ను తీసుకెళ్లు.. నీ కోసం వెయిట్ చేస్తున్నానని ఛాలెంజ్ చేశాడు. 

కొలంబియాపై అమెరికా దాడులు చేస్తే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కొలంబియాలో అమెరికా బాంబులు వేస్తే క్యాంపెసినోలు పర్వతాలలో లక్షలాది మంది గెరిల్లా పోరాట యోధులుగా మారతారని వార్నింగ్ ఇచ్చాడు. తనను అమెరికా అదుపులోకి తీసుకుంటే.. అధ్యక్షుడిని అమితంగా గౌరవించే కొలంబియా ప్రజలు పులులు అవుతారని హెచ్చరించాడు. గతంలో ఆయుధాన్ని పట్టుకోనని ప్రమాణం చేశానని.. కానీ మాతృభూమి కోసం మళ్లీ ఆయుధాలు పట్టుకుంటానని హాట్ కామెంట్ చేశారు. 

►ALSO READ | 16 ఏళ్లకే మలేషియా యువరాజుతో పెళ్లి.. ఆ తర్వాత ఎస్కేప్.. 17 ఏళ్ల తర్వాత నోరువిప్పిన ఇండోనేషియన్ మోడల్

కాగా, వెనిజులాపై దాడి తర్వాత ట్రంప్ కొలంబియాను హెచ్చరించిన సంగతి తెలిసిందే. వెనిజులా మాదిరిగానే కొలంబియాను కూడా అమెరికాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న వ్యక్తి నడుపుతున్నాడని గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ విమర్శించాడు. కొలంబియా తీరు మార్చుకోకపోతే వెనిజులా గతే పడుతోందని వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్‎గా గుస్తావో పెట్రో పై విధంగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

గతంలో ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకుని మదరో కూడా ఇదే విధంగా.. రా నన్ను పట్టుకుపో అని ఛాలెంజ్ చేశాడు. దీంతో ట్రంప్ అన్నంత పని చేశాడు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లాడు. మదురో మాదిరిగానే పెట్రో కూడా ట్రంప్ కు సవాల్ చేయడం గమనార్హం. మరీ పెట్రో వ్యాఖ్యలపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.