సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేలా..హైదరాబాద్- విజయవాడ హైవేపై డైవర్షన్

సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేలా..హైదరాబాద్- విజయవాడ హైవేపై డైవర్షన్
  • హైదరాబాద్  నుంచి వచ్చే వెహికల్స్ నార్కెట్ పల్లి, సూర్యాపేట మీదుగా మళ్లింపు
  • రోడ్డుపై గుంతలు లేకుండా రిపేర్లు చేయిస్తున్న ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు: రానున్న సంక్రాంతి పండుగకు హైదరాబాద్​ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై రద్దీని దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. 

బ్లాక్  స్పాట్స్  వద్ద చేపట్టిన పనులు ఆలస్యం అవుతుండడం, సంక్రాంతికి ప్రతిరోజు లక్షకు పైగా వెహికల్స్  రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఏపీకి వెళ్లే వెహికల్స్ ను డైవర్షన్  చేయాలని అధికారులు నిర్ణయించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరగకుండా, వాటికి రిపేర్లు చేస్తున్నారు.

విజయవాడ హైవేపై డైవర్షన్..

సంక్రాంతి పండుగకు హైదరాబాద్  నుంచి ఏపీకి వెళ్లే వారితో విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్​ నిలిచిపోయి ఇబ్బంది పడుతుంటారు. దీనిని నివారించేందుకు హైవేపై డైవర్షన్  చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్  నుంచి గుంటూర్​ వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా డైవర్షన్  చేసేందుకు ప్రతిపాదించగా, హైదరాబాద్  నుంచి రాజమండ్రి వైపు వెళ్లే వెహికల్స్ ను నకిరేకల్, అర్వపల్లి  మీదుగా ఖమ్మం వెళ్లేలా డైవర్షన్  చేయనున్నారు. 

విజయవాడ నుంచి హైదరాబాద్  వచ్చే వెహికల్స్ కోదాడ, రామాపురం మీదుగా హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా డైవర్షన్  చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్  నుంచి విజయవాడ వెళ్లే వెహికల్స్ ను చౌటుప్పల్  వద్ద ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడితే చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మీదుగా చిట్యాల వరకు, పెద్ద కాపర్తి వద్ద ట్రాఫిక్  జామ్  ఏర్పడితే  కొమ్మాయిగూడెం, రామన్న పేట చిట్యాలకు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాయినిగూడెం వద్ద యూటర్న్  మూసివేయడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్​ వెళ్లే వెహికల్స్ ను చివ్వెంల, ఐలాపురం మీదుగా హైదరాబాద్  మళ్లిస్తున్నారు. జనగాం, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు కుడకుడ రోడ్డు నుంచి ఐలాపురం మీదుగా బాలెంల వద్ద జనగాం రోడ్డుకు మళ్లిస్తున్నారు.  

ప్రమాదాలు జరగకుండా.. 

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైవేపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అవసరమైన చోట్ల సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్, లింకింగ్  లైట్స్, లైటింగ్, ప్రత్యామ్నాయ రోడ్లు, రోడ్లకు రిపేర్లు చేస్తున్నారు. యూటర్న్ లతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో సూర్యాపేట జిల్లా టేకుమట్ల నుంచి నల్లబండగూడెం వరకు యూటర్న్ లను తాత్కాలికంగా మూసివేసి ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

నల్గొండ, సూర్యాపేట జిల్లాలో హైవే వెంట 8 మంది సీఐలు, 4 హైవే పెట్రోలింగ్  టీమ్స్, 14 మంది ఎస్సైలు, 80 మంది కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీస్  శాఖ సిద్ధమైంది. హైవేపై ప్రమాదం జరిగితే రోడ్డుపై వెహికల్స్ ను తరలించేందుకు నాలుగు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు.

 డైవర్షన్ పై సూచనలు చేసేందుకు 30 మందిని షిఫ్ట్ ల వారీగా ఫ్లాగ్  లైన్  సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీస్, హైవే, ఆర్అండ్ బీ, రవాణా శాఖ అధికారులతో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్  రూమ్  ఏర్పాటు చేశారు. కంట్రోల్  రూమ్ కు ఫిర్యాదు వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించనున్నారు.