
న్యూఢిల్లీ: రేప్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ఓ యువకుడు, తన సోదరుడితో కలిసి కేసు పెట్టిన యువతి(19)ని నడిరోడ్డుపై గొడ్డలితో అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. యూపీలోని కౌశాంబి జిల్లాలో మంగళవారం ఈ ఘటన కలకలం రేపింది. నిందితులు పవన్ నిషాద్, అశోక్ నిషాద్ లకు మరో కుటుంబానికి పాతకక్షలు ఉన్నాయి. ఆ కుటుంబంలోని యువతి(19)పై మూడేండ్ల కింద పవన్ అత్యాచారం చేశాడు. మైనర్‌ను రేప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. మరో హత్య కేసులో అశోక్ కూడా జైలుకు వెళ్లాడు.
కొద్ది రోజుల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన పవన్.. యువతి కుటుంబాన్ని కేసు వాపస్ తీసుకోవాలని వేధిస్తున్నాడు. ఇంతలో అశోక్ కూడా బెయిల్ పై బయటకు వచ్చాడు. కేసు వాపస్ తీసుకోవాలని యువతిని, ఆ కుటుంబాన్ని వేధిస్తూ వస్తున్నారు. రేప్ కేసు వెనక్కి తీసుకోవాలనే విషయంలో యువతి కుటుంబంతో మరోసారి ఇటీవల గొడవ జరిగింది. అందుకు ఆ కుటుంబం ఒప్పుకోకపోవడంతో నిందితులు ఆమెను చంపేందుకు ప్లాన్ చేశారు. మంగళవారం ఉదయం పశువులు కాసుకొని ఇంటికి తిరిగి వస్తున్న యువతిని ఇద్దరు అన్నదమ్ములు గొడ్డలితో నరికి చంపేశారు. ఘటనను చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.