1933 దేవాలయ నిర్మాణాలకు టీటీడీ నిధులు .. ఒక్కో ఆలయానికి రూ. 10 లక్షలు

1933 దేవాలయ నిర్మాణాలకు  టీటీడీ నిధులు .. ఒక్కో ఆలయానికి రూ. 10 లక్షలు

ఆంధ్రప్రదేశ్ లో నూత‌నంగా నిర్మించ‌నున్న 1933 దేవాల‌యాల నిర్మాణాల‌కు సంబంధించి ఒక్కో ఆల‌యానికి రూ.10ల‌క్షలు చొప్పున టీటీడీ  శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరైన‌ట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ తెలిపారు. దేవాల‌య భూముల ప‌రిర‌క్షణ కోసం క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేర‌కు త్వరలో జీవో విడుదల చేస్తామన్నారు. 

అర్చకులకు ముఖ్యమంత్రి జ‌గ‌న్ హామీ మేర‌కు రిటైర్‌మెంట్ లేకుండా పనిచేసేందుకు  త్వర‌లో జీవో విడుద‌ల చేస్తామన్నారు. రాష్ట్రంలోని  దేవాలయాల  అర్చకుల‌కు రూ.10వేలు, రూ.15,625 వేత‌నాలుగా ఇస్తామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.   అర్చకుల‌కు ఆయా దేవాల‌యాల ప‌రిధిలో ఇండ్ల స్థలం కేటాయించి ....  రూ.5ల‌క్షల లోపు ఆదాయం ఉన్న గుడుల‌కు  వ్యవ‌స్థాప‌క స‌భ్యులు, వార‌స‌త్వ అర్చకులు, గుర్తించ‌బ‌డిన సంస్థల‌కు అప్పగించేలా త్వరలోనే జీవో విడుద‌ల చేస్తామన్నారు.  ధూప‌, దీప ప‌థ‌కం కింద 4,600 గుళ్ళకు స‌హాయం అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

విజయవాడ దుర్గ గుడి అభివృద్ది

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాల‌య‌మైన శ్రీదుర్గామ‌ల్లేశ్వర స్వామివార్ల దేవ‌స్థానాన్ని అభివృద్ధి చేయాల‌న్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంక‌ల్పాన్ని నెర‌వేర్చే దిశ‌లో దుర్గగుడి అభివృద్ధి ప‌నులు చురుగ్గా జ‌రుగుతున్నాయన్నారు.  మంగ‌ళ‌వారం(జూన్13)   దేవాదాయ శాఖ క‌మిషన‌ర్ ఎస్‌.స‌త్యనారాయ‌ణ‌  దుర్గగుడి అభివృద్ధి ప‌నుల‌పై  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై మ‌ల్లిఖార్జున స్వామి దేవాల‌యం పున‌ర్నిర్మాణం, ప్రాకార మండ‌పం నిర్మాణం, సివిల్ వ‌ర్క్స్ జులై 30వ తేదీ నాటికి పూర్తి కావాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. గోపురంపై విగ్రహాల నిర్మాణం, ధ్వజ‌స్థంభ నిర్మాణం నిర్ణీత గ‌డువులోగా పూర్తి కావాల‌ని అన్నారు.

మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌య పున‌ర్నిర్మాణం

కార్తీక మాసంలో మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌య పున‌ర్నిర్మాణంతో పాటు గుడిలో విగ్రహాల ప్రతిష్ట జ‌రిపేలా ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారులను ఆదేశించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.   వ‌ర్షాకాలంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో కొండ‌రాళ్లు జారిప‌డ‌కుండా  ఐర‌న్ మెష్ ఏర్పాటు ప‌నులు  పూర్తయ్యాయ‌ని తెలిపారు. ఘాట్ రోడ్డులో రూ.4.20కోట్లతో డిజైన్, ఫ్యాబ్రికేష‌న్ స‌ప్లై అండ్ ప్యాన‌ల్ బోర్డ్, ప్రొసిడింగ్ ఎన‌ర్జీ అండ్ వాట‌ర్ మేనేజ్‌మెంట్(స్కాడా) ప‌నులు పూర్తయ్యాయ‌న్నారు.  రూ.3.25 కోట్ల వ్యయంతో అన్నదాన మండ‌పం నిర్మాణానికి గ‌తంలో రూ.19.75 కోట్లు వెచ్చించ‌గా ... ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వంలో దానిని రూ.30కోట్లకు పెంచార‌ని తెలిపారు. అలాగే ప్రసాదం పోటు భ‌వ‌న నిర్మాణానికి గ‌తంలో రూ.8.50 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పెంచార‌ని వాటి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ అనుమ‌తులు కోసం డీపీఆర్ సిద్ధం చేశామ‌ని చెప్పారు.  పీపీపీ విధానంలో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ కోసం రూ.60కోట్లు, ఎలివేట‌ర్ క్యూ లైన్ల కోసం రూ.13 కోట్లతో టెండ‌ర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై పూజా మండ‌పాలు రూ.8.90కోట్లతో త్వర‌లోనే టెండ‌ర్లు పిలుస్తామ‌ని పేర్కొన్నారు.