కేసీఆర్ మాట నిలబెట్టుకుని న్యాయం చేయాలి

కేసీఆర్ మాట నిలబెట్టుకుని న్యాయం చేయాలి

ఏపీలో ఇచ్చిన విధంగానే తమకూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుండి అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... 2016లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ  ప్రకారం  ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

చట్ట సభలతో పాటుగా వరంగల్ లో  జరిగిన ఓ సమావేశంలో కూడా కేసీఆర్..  1998వ బ్యాచ్ డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక కోటాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకుని  న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే ఎంతో మంది అభ్యర్థులు చనిపోయారని ఉన్నోళ్లకైనా న్యాయం చేయాలని అన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. ఉద్యోగం చేసే మా పిల్లలకు ఫలానా ఉద్యోగం కోసం  మేము వెళ్తున్నామని చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

1998 డీఎస్సీ  క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఇంకా మూడు, నాలుగు ఏండ్ల సర్వీస్ మాత్రమే ఉన్నప్పటికీ వారు ఇంకా  పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఈ బ్యాచ్ క్వాలిఫైడ్ అభ్యర్థులు 1800 నుంచి 2000 మంది ఉండగా ఇందులో 100కు పైనే చనిపోయారు.