వసూళ్ల దందా.. 2 శాతం కమీషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్!

వసూళ్ల దందా.. 2 శాతం కమీషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్!
  • సబ్​ రిజిస్ట్రార్​, ఎమ్మార్వో ఆఫీసుల్లో వసూళ్ల దందా
  • ప్రతి నెల కోట్లల్లో లంచాలు.. హోదాల వారీగా వాటాలు

హైదరాబాద్, వెలుగురిజిస్ట్రేషన్  ఆఫీసుల్లో చేయి తడిపితే కానీ పనులు కావడం లేదు. లంచం ఇస్తేకానీ ఫైలు ముందుకు కదలడం లేదు. డాక్యుమెంట్​ విలువపై 2 శాతం  ముట్టజెప్పకపోతే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొర్రీలు పెడుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులతో సబ్​ రిజిస్టార్లు కుమ్మక్కై లంచాల దందా నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అటు ఎమ్మార్వో ఆఫీసుల్లో అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్లలోనూ వసూళ్ల దందా కొనసాగుతోంది. స్లాట్ బుకింగ్ టైమ్ లో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు అదనంగా డబ్బులను మధ్యవర్తులు వసూలు చేస్తున్నారని, ఇందులో ఎమ్మార్వో ఆఫీసులోని స్టాఫ్​కు వాటాలు ఇస్తున్నారని కంప్లయింట్స్​ ఉన్నాయి. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎవరి వాటా వారిదే!

రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసులు ఉన్నాయి. ఇందులో ప్రతి నెలా సుమారు లక్ష వరకు నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే డాక్యుమెంట్ విలువపై 2 శాతం లంచం ఇవ్వనిదే సబ్ రిజిస్ట్రార్లు సంతకం పెట్టడం లేదని జనం అంటున్నారు. ఇట్లా ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ వసూళ్లను ముందుగా సబ్- రిజిస్ట్రార్​ ఆఫీసుల్లోని స్టాఫ్ హోదాల వారీగా పంచుకుంటారని, మిగతా సొమ్మును జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీసుల్లోని బాస్ లకు కూడా పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ప్రభుత్వం మొదట భావించింది. కానీ టెక్నికల్, లీగల్ సమస్యల వల్ల ఆ ప్రాసెస్​కు పుల్ స్టాప్ పెట్టి మళ్లీ పాత పద్ధతి ప్రకారం వెళ్తోంది. దీంతో ప్రభుత్వం భవిష్యత్ లో ఎప్పుడైనా ధరణి పోర్టల్ ద్వారానే నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయొచ్చనే అనుమానంతో కొన్ని సబ్- రిజిస్ట్రార్​ ఆఫీసుల్లోని స్టాఫ్​ వసూళ్లకు ఎగబడ్డారు. రెగ్యులర్ గా వసూలు చేసే దానికంటే ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి.

డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులే కీలకం

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్  జరిగే  సబ్- రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులే కీలకంగా ఉంటున్నారు. ఈ ఆఫీసులో పనిచేసే స్టాఫ్​ ఎవరు కూడా ప్రజల నుంచి నేరుగా డబ్బులు తీసుకోరు. తమ వద్దకు వచ్చే ప్రజలకు ఫలానా డాక్యుమెంట్ రైటర్​ దగ్గరికో, ఫలానా మధ్యవర్తి దగ్గరకో వెళ్లాలని వారు సూచిస్తుంటారు. డాక్యుమెంట్​ రైటర్​ దగ్గరికో, మధ్యవర్తి దగ్గరికో వెళ్తే వాళ్లు తాము చెప్పినంత డబ్బులు ఇస్తేనే పని అయితదని, లేకుంటే కష్టమని తెగేసి చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని, వెబ్ సైట్​లో పెట్టిన టెంప్లెట్ ప్రకారం  డాక్యుమెంట్లు తీసుకెళ్తే రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఏదో ఒక కొర్రి పెట్టి వెనక్కి పంపుతున్నారు.

ఒక్కోదానికి ఒక్కో రేటు

సబ్ -రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా మధ్యవర్తులు చెప్పినంత ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తామని అంటే సర్టిఫికెట్ ఇవ్వడానికి టైం పడుతుందని రోజుల కొద్దీ తిప్పించుకుంటున్నారు. ప్రభుత్వం ఈసీ సర్టిఫికెట్ కోసం రూ. 220,  మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్  కోసం  రూ. 20 ఫీజు నిర్ణయించింది. ఈ ఫీజు కడుతామంటే.. పనులు కావడం లేదు. అదే రూ. 1,500  ఇస్తే గంటలోపే మధ్యవర్తులు సర్టిఫికెట్​ను సబ్-రిజిస్ట్రార్​ ఆఫీసు  నుంచి తెచ్చిపెడ్తున్నారు.