
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంకు బాంబు పేలుడు బెదిరింపు రావడం షాకింగ్ గా మారుతుంది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా ప్రతీకారం తీర్చుకుంటామని గుర్తు తెలియని వ్యక్తి ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు శనివారం (మే 11) తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పోలీసులకు తెలిపింది. నాలుగు పోలీసు బృందాలులతో పాటు బాంబు స్క్వాడ్ ఐదు గంటల పాటు స్టేడియం ప్రాంగణాన్ని క్షుణ్ణంగా శోధించాయి. అయితే హోల్కర్ స్టేడియంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనుగొనబడలేదని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జితేంద్ర సింగ్ యాదవ్ PTI కి తెలిపారు.
ప్రస్తుతం సైబర్ స్క్వాడ్ సహకారంతో పోలీసులు ఈ నకిలీ ఈ-మెయిల్ మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ఇమెయిల్ (ID) కు శుక్రవారం ఒక బెదిరింపు సందేశం వచ్చింది. ఇంగ్లీషులో రాసిన ఈ ఇమెయిల్‌లో "ఆపరేషన్ సిందూర్ కారణంగా స్టేడియం పేల్చివేయబడుతుందని రాయబడి ఉంది". అని జితేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
►ALSO READ | IPL 2025: ఐపీఎల్ సస్పెన్షన్ కారణంగా బీసీసీఐకి భారీ నష్టం.. ఒక్క మ్యాచ్‌కు ఏకంగా రూ. 125 కోట్లా..
ప్రాథమికంగా ఈ ఇమెయిల్‌ను కాపీ-పేస్ట్ చేసినట్లు అనిపిస్తోంది. అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు. గత నెలలో ఇండోర్ విమానాశ్రయం, బ్యాంకు శాఖలు, ఆసుపత్రులు, పాఠశాలలను బాంబు దాడి చేస్తామని బెదిరించే నకిలీ ఈమెయిల్‌లు వచ్చాయని ఆ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కారణంగా ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం లేదు.