మసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..

మసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..

ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఉగ్ర మూకలను చెల్లాచెదురు చేసిన మిషన్. టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ అది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులకు బుద్ధి చెప్పేందుకు పకడ్బంధీగా ఇండియా చేసిన దాడి అది.

 పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న తొమ్మిది టెర్రర్ క్యాంపులను ఆపరేషన్ సిందూర్ తో ధ్వంసం చేసింది ఇండియా.  ఇండియా మెరుపుదాడితో ఇక మా పని అయిపోయిందని ఏకంగా పార్లమెంటులోనే ఎంపీలు రోధించేలా చేసింది. అయితే మే 7న జరిగిన ఈ ఆపరేషన్ సిందూర్ లో ఐదుగురు కీలక ఉగ్రవాదులను హతం చేసినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 

మే 7 అర్థరాత్రి 1.30 గంటలకు జరిగిన ఈ దాడిలో ముదస్సర్ ఖదియన్ ఖాస్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యుసుఫ్ అజార్, ఖలీద్, మహమ్మద్ హసన్ ఖాన్ అనే ఐదుగురు కీలక ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇండియా ప్రకటించింది. ఈ ఐదుగురు చాలా హై ప్రొఫైల్ టెర్రరిస్టులుగా చెబుతున్నారు. లష్కర్ ఈ తోయిబా, జైషే ఈ మొహమ్మద్ గ్రూపులకు చెందిన ముఖ్యమైన టెర్రరిస్టులను హతమార్చడం ఆపరేషన్ సిందూర్ సక్సెస్ లో ఒక భాగం. 

►ALSO READ | కాళ్ల బేరానికి పాకిస్తాన్.. యుద్ధం నిలువరించేందుకు చర్చలు.. 3 రోజులకే ఫసక్

ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ముదస్సర్ ఖదియన్ ఖాస్.. జైషే ఈ మొహమ్మద్ టెర్రర్ గ్రూప్ లో కీలక నేత. హఫీజ్ ముహమ్మద్ జమీల్ జైషే ఈ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బావమరిది. ఈ గ్రూప్ లో కీలక నేత. , మొహమ్మద్ యుసుఫ్ అజర్ కూడా   మసూద్ అజర్ రెండవ బావమరిది. జమ్ము కశ్మీర్ లోని టెర్రర్ అటాక్స్ లలో కీలక నిందితుడు. IC-814 ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాకింగ్ లో హస్తం ఉన్న ఉగ్రవాది. ఖలీద్ అబు అకాస లష్కర్ ఈ తోయిబా కమాండర్ గా పనిచేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ లో కీలకంగా పనిచేస్తుంటాడు. ఇక మహమ్మద్ హసన్ ఖాన్ జైషే ఈ మొహమ్మద్ ఆపరేషనల్ కమాండ్ కుమారుడు.

లష్కర్ ఈ తోయిబా, జైషే ఈ మొహమ్మద్ గ్రూపులకు చెందిన కీలక ఉగ్రవాదులు ఆపరేషన్ సిందూర్ లో హతమయ్యారని ఇండియా ప్రకటించింది. అయితే టెర్రిరిజంతో మాకు సంబంధం లేదంటూ బుకాయించే పాక్.. ఈ ఐదుగురు టెర్రరిస్టుల అంత్యక్రియల్లో ఆర్మీ ఆఫీసర్లు, ప్రభుత్వ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అధికారికంగా పాల్గొని అంత్యక్రియలు జరిపించారు. దీంతో ఉగ్రవాదులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందనే వాదనలు నిజమనే విషయం అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఇండియా ఆధారాలతో సహా ఎత్తిచూపింది.