
హైదరాబాద్: భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైల్, డ్రోన్ దాడులు చేసుకుంటున్నాయి. దీంతో భారత్, పాక్ మధ్య అనధికారికంగా యుద్ధం మొదలైనట్లేనని సంకేతాలు వెలువడుతున్నాయి. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌పైన కూడా పడింది. ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతోన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ఆటగాళ్ల భద్రత, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం (మే 9) బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ వాయిదా పడటంతో ముందే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు ఆయా ఫ్రాంచైజ్‌లు టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నాయి.
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. 2025, మే 10న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేయడంతో ఈ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు బుక్ చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మ్యాచ్‌కు ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి త్వరలోనే రిఫండ్ చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ టీమ్ యజమాన్యం శుక్రవారం (మే 9) ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఉప్పల్ స్టేడియంలో మే 10న జరగనున్న KKR , SRH మ్యాచ్‌కి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్న వారికి త్వరలోనే రిఫండ్ వస్తుంది’’ అని పోస్టులో పేర్కొన్నారు.
ఆస్ట్రేలియన్ ప్లేయర్ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో బరిలోకి దిగిన SRH ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించింది. 11 మ్యాచులు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింట్లోనే విజయం సాధించి.. ఏడు గేముల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. గత సీజన్లో అద్భతుంగా ఆడి రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ పై ఈ సారి సీజన్ ప్రారంభానికి ముందు భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సీజన్ తొలి మ్యాచులోనే హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలో రెండో హ్యాయొస్ట్ స్కోర్ సాధించి దుమ్మురేపింది. కానీ ఆ తర్వాత నుంచి హైదరాబాద్ పతనం ప్రారంభమైంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై.. చెత్త ప్రదర్శన చేసింది.