‘బేబీ డ్రైవర్’లా బ్యాంకు దోచేద్దామకున్నారు

‘బేబీ డ్రైవర్’లా బ్యాంకు దోచేద్దామకున్నారు

సెక్యూరిటీ గార్డుకు దొరికిపోయారు

న్యూఢిల్లీ: ముగ్గురు బాగానే చదువుకున్నారు. చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. కానీ, వచ్చే డబ్బు సరిపోవడం లేదు. ప్రభోత్ సింగ్(25) డిగ్రీ పూర్తి చేశాడు. సుఖ్ దేవ్ సింగ్(19) బీఎస్సీ చదువుతున్నాడు. ఇంద్రజీత్ సింగ్ చదువు ఆపేసి ఏసీ రిపేర్లు చేస్తున్నాడు. ఏం చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందా అని ఆలోచించసాగారు.

ఓ రోజు హాలీవుడ్ సినిమా ‘బేబీ డ్రైవర్’ చూశారు. అందులో బ్యాంకు చోరీ ప్రయత్నం బాగా నచ్చింది. అచ్చూ అలాగే న్యూ ఢిల్లీలోని షాదరా కృష్ణా నగర్ లోని కొటక్ మహీంద్రా బ్యాంకును దోచుకోవాలని అనుకున్నారు. వారం రోజుల ముందు రెక్కీ చేశారు. లంచ్ తర్వాత బ్యాంకులో డబ్బు మార్చుతారని గుర్తించారు. ఓ పిస్టల్ సంపాదించారు. పోయిన మంగళవారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు ప్రభోత్, సుఖ్ దేవ్ బ్యాంకులోకి చొరబడ్డారు. పిస్టల్ తో గాల్లోకి కాల్పులు జరిపారు.

బ్యాంకు ఉద్యోగులు హడలిపోయారు. సెక్యూరిటీ గార్డు వెంటనే ఆ ఇద్దరిని అడ్డుకున్నాడు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన బ్యాంకుకు చేరుకుని వాళ్లను అరెస్టు చేశారు. బయట వీళ్ల కోసం ఎదురుచూసిన ఇంద్రజీత్ పోలీసుల రావడం చూసి పారిపోయాడు. అతడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దోపిడి కోసం వాడిన బైకును సీజ్ చేసినట్లు వెల్లడించారు.