రైలు ఢీకొని రైల్వే ఉద్యోగులే మృతి

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగులే మృతి

యూపీలో రైలు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం (డిసెంబర్ 1) హంగీరాబాద్ రైల్వేస్టేషన్, గోండా-బారాబంకి రైల్వే సెక్షన్ సమీపంలో సిగ్నలింగ్  రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు అరవింద్ కుమార్ (28), తాలా సోరేన్ అలియాస్ కల్లు(45) గా గుర్తించారు. గాయపడిన ఉద్యోగి దేవీ ప్రసాద్ (30) ను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. 

సిగ్నలింగ్ స్థంభాలలో ఒకదానిలో లోపాన్ని సరిచేస్తుండగా రెండు ట్రాక్లపైకి కొచ్చిన్ ఎక్స్ ప్రెస్, బరౌని ఎక్స్ ప్రెస్ ఒకేసారి వచ్చాయి. ఉద్యోగులను కొచ్చిన్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవీ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. 

ప్రమాదంలో  మరణించిన ఉద్యోగులు అరవింద్ కుమార్ జహంగీరాబాద్ రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిషియన్గా, సోరేన్ సిగ్నల్ అసిస్టెంట్గా , దేవీ ప్రసాద్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై  విచారణ జరుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.