రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్

రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకు సమీపంలోని చద్దా క్యాంపు దగ్గర్లో సీఐఎస్ఎఫ్​ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. గ్రెనేడ్లతో దాడికి దిగారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు చోటు చేసుకుంది. టెర్రరిస్టుల కాల్పుల్లో సీఐఎస్ఎఫ్​ కు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీఐఎస్ఎఫ్​ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. బలగాల దాడుల నుంచి తప్పించుకునేందుకు టెర్రరిస్టులు పారిపోయారు.

కాగా, కశ్మీర్ లోని సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నలుగురు టెర్రరిస్టులను జవాన్లు మట్టుబెట్టారు. మృతి చెందిన వారిలో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూ కూడా ఉన్నాడు. సుంజ్వాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో సెక్యూరిటీ  ఫోర్సెస్ ముందస్తు ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్ మొదలైందని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందిన తర్వాత తాము గురువారం రాత్రి ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టామని పేర్కొన్నారు. కాల్పుల్లో పలువురు టెర్రరిస్టులు మృతి చెందారని.. మిగిలిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. 

మోడీ పర్యటన
కశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఈనెల 24న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలి గ్రామంలో జరిగే భారీ సభలో ఆయన ప్రసంగించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత మోడీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. అయితే మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు ఇలా ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధానికి భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం:

కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న

అనన్యా పాండే డబుల్  డ్యూటీ