చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌: అమ‌రులైన‌ 20 మంది భార‌త జ‌వాన్లు

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌: అమ‌రులైన‌ 20 మంది భార‌త జ‌వాన్లు

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మొత్తం 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రుల‌య్యార‌ని ఆర్మీ ప్ర‌క‌టించింది. ల‌ఢ‌ఖ్‌లోని గాల్వా‌న్ లోయ ప్రాంతంలో సోమ‌వారం రాత్రి చైనా సైనికులు భార‌త భూభాగంలోకి చొచ్చుకుని రావ‌డంతో భార‌త బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. ఈ స‌మ‌యంలో రెండు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చైనా సైనికులు రాళ్లు, ఇనుప‌రాడ్ల‌తో దాడికి దిగడంతో ప‌లువురు భార‌త జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు అమ‌రులైన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది ఆర్మీ. అయితే మైన‌స్ డిగ్రీల మంచు వాతావ‌ర‌ణంలో రాత్రి వేళ జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌లువురు సైనికులు తీవ్ర గాయాల‌తో కింద‌ప‌డిపోయారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 17 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మంగ‌ళ‌వారం రాత్రి అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ల‌ఢ‌ఖ్‌లో జ‌రిగిన స్టాండ్ఆఫ్‌లో మొత్తం 20 మంది సైనికులు అమ‌రులైన‌ట్లు తెలిపింది. భార‌త భూభాగాన్ని, సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకోవ‌డంతో ఆర్మీ వెన‌క‌డుగు వేయ‌ద‌ని స్ఫ‌ష్టం చేసింది. అయితే గాల్వాన్ లోయ వ‌ద్ద భార‌త భూభాగంలోకి చొచ్చుకుని వ‌చ్చి దాడికి పాల్ప‌డిన స‌మ‌యంలో మ‌న జ‌వాన్లు గ‌ట్టిగా ప్ర‌తిఘ‌టించారు. ప్ర‌తి దాడిలో చైనాకు చెందిన 43 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.